
- కేకే మహేందర్‌రెడ్డి
రాజన్నసిరిసిల్ల, వెలుగు: బతుకమ్మ చీరలకు సంబంధించి నేత కార్మికులకు రూ.352 కోట్లు బకాయిలు పెట్టి వారిని సంక్షోభంలోకి నెట్టింది బీఆర్ఎస్సేనని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ నేతన్నలను నిండా ముంచి లెటర్ల పేరుతో కేటీఆర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలను అన్ని విధాలా ఆదుకుంటోందని చెప్పారు.
అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్ హయాంలో బతుకమ్మ చీరల బకాయిలను క్లియర్ చేసినట్లు గుర్తుచేశారు. మహిళా సమాఖ్యలకు స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు, వేములవాడలో యార్న్ డిపో ఏర్పాటు, నేత కార్మికులకు బీమా, ఇందిరమ్మ చీరలు.. ఇలా అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్లు చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని లెటర్లు రాయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ప్రకాశ్, లీడర్లు గడ్డం నర్సయ్య, ఆకునూరి బాలరాజు, గోనే ఎల్లప్ప, చందన, తదితరులు పాల్గొన్నారు.