ఐపీఎల్లో అరుదైన రికార్డు

ఐపీఎల్లో అరుదైన రికార్డు

టాలెంటెడ్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600లకు పైగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ 2022లో 15 మ్యాచులు ఆడిన రాహుల్..51.33 సగటుతో 616 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 135.38 కావడం విశేషం. ఈ సీజన్లో రెండు సెంచరీలతో పాటు..నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు.  రాహుల్ కంటే ముందు క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ మూడు సీజన్లలో 600 పైగా పరుగులు సాధించారు. ఇక అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాజస్థాన్ ప్లేయర్ బట్లర్ 718 పరుగులతో టాప్ ప్లేస్లో ఉండగా...రెండో స్థానంలో కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు.

ఆటగాడిగా అదుర్స్..
30 ఏళ్ల రాహుల్.. ఐపీఎల్ 2013లో అరంగేట్రం చేశాడు. అయితే 2016 సీజన్ వరకు అతను పెద్దగా రాణించింది లేదు. కానీ 2016 సీజన్లో రాహుల్ రెచ్చిపోయాడు. 14 మ్యాచుల్లో 44.11 సగటుతో 397 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు అర్థసెంచరీలున్నాయి. ఆ తర్వాత 2018 సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు కేఎల్ రాహుల్. 14 మ్యాచుల్లో 54.91 ఆవరేజ్తో 6 హాఫ్ సెంచరీలతో 659 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 158.41 కావడం గమనార్హం. ఇక 2019 సీజన్లో 600 పరుగులకు కేవలం 7 పరుగుల దూరంలో నిలిచాడు. మొత్తం 14 మ్యాచుల్లో 53.90 సగటుతో 593 రన్స్ కొట్టాడు. ఈ సీజన్లోనే తొలి సెంచరీ నమోదు చేశాడు రాహుల్. 2020 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 670పరుగులు దంచికొట్టాడు. ఒక సెంచరీతో పాటు 5 హఫ్ సెంచరీలు సాధించాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసింది రాహులే. దీంతో అతను ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. లాస్ట్ ఐపీఎల్లో 13మ్యాచ్‌ల్లో పాల్గొని.. 626 రన్స్ కొట్టాడు. ఇందులో 6 అర్థసెంచరీలున్నాయి. 

కెప్టెన్గానూ హిట్టే..
గత సీజన్లో పంజాబ్ కెప్టెన్గా దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్..ఈ సీజన్లో మాత్రం లక్నో కెప్టెన్గా సూపర్ హిట్ అయ్యాడని చెప్పొచ్చు. తొలి సీజన్లోనే లక్నో సూపర్ జెయింట్ను ప్లేఆఫ్కు చేర్చాడు కేఎల్ రాహుల్. 14 మ్యాచుల్లో లక్నో 9 మ్యాచుల్లో గెలిచింది. కేవలం 5 మ్యాచుల్లో ఓడింది. దీంతో లీగ్ దశలో 18 పాయింట్లతో లక్నో మూడో స్థానంలో నిలిచింది. అయితే దురదృష్టవశాత్తు..ప్లేఆఫ్లో బెంగుళూరు చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలన్న కేఎల్ రాహుల్ కల చెదిరింది.