ఇంగ్లండ్ టెస్టులో రాహుల్‌ హిట్​

ఇంగ్లండ్ టెస్టులో రాహుల్‌ హిట్​
  • ఇండియా ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో 276/3
  • రాణించిన రోహిత్‌‌, కోహ్లీ 

లండన్‌‌: ఇంగ్లండ్‌‌తో గురువారం మొదలైన సెకండ్‌‌ టెస్ట్‌‌లో ఇండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ (127 బ్యాటింగ్‌‌) వీరోచిత సెంచరీకి తోడుగా రోహిత్‌‌ శర్మ (145 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 83), రాణించడంతో.. ఫస్ట్‌‌ డే ఆట ముగిసే టైమ్‌‌కు టీమిండియా ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో 90  ఓవర్లలో 3 వికెట్లకు 276 రన్స్‌‌ చేసింది. రాహుల్‌‌తో పాటు రహానె (1 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నాడు. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన రోహిత్‌‌, రాహుల్‌‌ స్టార్టింగ్‌‌లో చాలా నెమ్మదిగా ఆడారు. అండర్సన్‌‌ (2/52) రెండు రకాలుగా రివర్స్‌‌ స్వింగ్‌‌ రాబట్టడంతో ఈ ఇద్దరు ఎక్కువ బాల్స్‌‌ను వదిలేశారు. రోహిత్‌‌ స్ట్రోక్స్‌‌ కొట్టడానికి ఇష్టపడలేదు. రాహుల్‌‌ కూడా డెడ్‌‌ డిఫెన్స్‌‌కు ప్రాధాన్యమివ్వడంతో ఫస్ట్‌‌ టెన్‌‌ ఓవర్స్‌‌లో కేవలం 11 రన్సే వచ్చాయి. అయితే సామ్‌‌ కరన్‌‌ వేసిన13వ ఓవర్‌‌లో రోహిత్‌‌ ఫ్లిక్‌‌ షాట్‌‌తో ఫస్ట్‌‌ బౌండ్రీ రాబట్టాడు. అతని తర్వాతి ఓవర్‌‌లో వరుసగా నాలుగు ఫోర్లు కొట్టిన ముంబైకర్‌‌ క్రీజులో కుదురుకున్నాడు. ఈ ఇద్దరు నిలకడను చూపడంతో లంచ్‌‌ వరకు ఇండియా 46/0 స్కోరు చేసింది.

రోహిత్​ మిస్​
లంచ్‌‌ తర్వాత రోహిత్‌‌ కొద్దిగా బ్యాట్‌‌ను ఝుళిపించాడు. పేస్‌‌–స్పిన్‌‌ కాంబినేషన్‌‌ను దీటుగా ఎదుర్కొంటూ చకచకా రన్స్‌‌ సాధించాడు. అయితే కరన్‌‌ ప్లేస్‌‌లో బౌలింగ్‌‌కు వచ్చిన రాబిన్సన్‌‌ కొద్దిగా ప్రభావం చూపెట్టాడు. ఎక్కువగా ఇన్‌‌ స్వింగర్లతో రోహిత్‌‌ను నిలువరించే ప్రయత్నం చేశాడు. మార్క్‌‌ వుడ్‌‌ బౌలింగ్‌‌లో అద్భుతమైన ఫుల్‌‌ షాట్‌‌ కొట్టి  ఫిఫ్టీ మార్క్‌‌ను అందుకున్నాడు. ఆ వెంటనే మొయిన్‌‌ అలీ బాల్‌‌ను స్టాండ్స్‌‌లోకి పంపాడు. ఇక వంద బాల్స్‌‌ ఆడినా కూడా బౌండ్రీ కొట్టని రాహుల్‌‌ కూడా అలీ బాల్‌‌ను లాంగాఫ్‌‌లో భారీ సిక్సర్‌‌గా మలిచాడు. అయితే 44వ ఓవర్‌‌లో అండర్సన్‌‌ వేసిన ఇన్‌‌ స్వింగర్‌‌ రోహిత్‌‌ వికెట్లను తాకింది. డిఫెన్స్‌‌ చేసే క్రమంలో ముంబైకర్‌‌ లైన్‌‌ మిస్సయాడు. ఫలితంగా ఫస్ట్‌‌ వికెట్‌‌కు 126 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఫలితంగా 69 ఏళ్ల తర్వాత లార్డ్స్‌‌లో వందకు పైగా పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ నెలకొల్పిన జోడీగా రోహిత్‌‌–రాహుల్‌‌ రికార్డులకెక్కారు. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన పుజారా (9) నిరాశపర్చాడు. ఆరు ఓవర్ల తర్వాత అండర్సన్‌‌కే వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. కోహ్లీ (42)తో జతకలిసిన రాహుల్‌‌ క్రమంగా వేగం పెంచాడు. చెత్త బంతులను బౌండ్రీలకు తరలిస్తూ హాఫ్‌‌ సెంచరీ అందుకున్నాడు. టీ విరామానికి ఇండియా 157/2తో నిలిచింది. లాస్ట్‌‌ సెషన్‌‌లో మరింత మెరుగ్గా ఆడిన రాహుల్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా లార్డ్స్‌‌లో సెంచరీ చేసిన పదో ఇండియన్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా రాహుల్‌‌ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌‌గా అతనికి ఇది ఆరోది. అయితే మ్యాచ్‌‌ చివర్లో రాబిన్సన్‌‌.. కోహ్లీని ఔట్‌‌ చేసి షాకిచ్చాడు. మూడో వికెట్‌‌కు 117 రన్స్‌‌ సమకూరాయి.