కేఎల్‌ కేక

కేఎల్‌ కేక

మెరుపు ఫిఫ్టీ, ఫీల్డింగ్​తో మెప్పించిన కేఎల్​ రాహుల్​

అడిలైడ్‌‌‌‌‌‌: ‘కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ గురించి ఎవరేం అనుకున్నా సరే. మాకు అతనిపై పూర్తి నమ్మకం ఉంది. తనే ఓపెనర్‌‌‌‌గా వస్తాడు. ఓసారి రిథమ్‌‌‌‌లోకి వస్తే మ్యాచ్‌‌‌‌పై చాలా ప్రభావం చూపిస్తాడు’ టీ20 వరల్డ్ కప్‌‌‌‌ మూడు ఇన్నింగ్స్​ల్లో ఫెయిలైన ఓపెనర్‌‌‌‌ కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ గురించి బంగ్లాదేశ్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌కు ముందు కోచ్‌‌‌‌ రాహుల్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌ చెప్పిన మాటలివి. గురువు తనపై ఉంచిన నమ్మకాన్ని  కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ నిలబెట్టాడు. ధనాధన్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో ఫిఫ్టీ కొట్టి అద్భుత ఆరంభం ఇచ్చిన అతను.. కష్టసమయంలో మెరుపు ఫీల్డింగ్‌‌‌‌తో ఇండియాను ఆదుకున్నాడు. దాంతో, బుధవారం  వర్షం అంతరాయంతో ఉత్కంఠ రేకెత్తిన పోరులో టీమిండియా ఐదు రన్స్‌‌‌‌ (డక్ వర్త్‌‌‌‌ పద్ధతి) తేడాతో బంగ్లాను ఓడించింది. గ్రూప్‌‌‌‌2లో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు దూసుకెళ్లి సెమీఫైనల్‌‌‌‌కు మరింత చేరువైంది.  విరాట్‌‌‌‌ కోహ్లీ (44 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 64 నాటౌట్‌‌‌‌), కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (32 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) మెరుపులతో తొలుత ఇండియా 20 ఓవర్లలో 184/6 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో లిటన్‌‌‌‌ దాస్‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) దూకుడుతో  బంగ్లా 7 ఓవర్లలో 66/0తో పటిష్ట స్థితిలో ఉన్న టైమ్‌‌‌‌లో వర్షం వచ్చింది. వాన ఆగిన తర్వాత బంగ్లా టార్గెట్‌‌‌‌ను 16 ఓవర్లలో 151గా సవరించారు. బ్రేక్‌‌‌‌ తర్వాత ఇండియా బౌలర్లు పుంజుకోవడంతో బంగ్లా 16 ఓవర్లలో 146/6 స్కోరు చేసి ఓడిపోయింది. కోహ్లీకి ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు దక్కింది. ఇండియా ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌‌‌‌లో జింబాబ్వేతో పోటీ పడుతుంది.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 184/6 ( కోహ్లీ 64*, కేఎల్​ రాహుల్‌‌‌‌ 50, హసన్‌‌‌‌ మహ్మూద్‌‌‌‌ 3/47)
బంగ్లాదేశ్‌‌‌‌: 16 ఓవర్లలో (టార్గెట్‌‌‌‌ 151) 146/6 (లిటన్‌‌‌‌ 60, నురుల్‌‌‌‌ 25 *, పాండ్యా 2/28, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ 2/38).

మలుపు తిప్పిన రనౌట్​

భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌ను బంగ్లా మెరుపు వేగంతో స్టార్ట్‌‌‌‌ చేసింది. వర్షం సూచన ఉండటంతో డక్‌‌‌‌వర్త్‌‌‌‌ను దృష్టిలో ఉంచుకొని ఓపెనర్​ లిటన్‌‌‌‌ భారీ షాట్లతో చెలరేగాడు. పవర్‌‌‌‌ ప్లేను సద్వినియోగం చేసుకుంటూ ఇండియా పేసర్లపై వరుస బౌండ్రీలతో రెచ్చిపోయాడు. షమీ బౌలింగ్‌‌‌‌లో సిక్స్‌‌‌‌తో తను 21 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. పవర్‌‌‌‌ ప్లేలో బంగ్లా 60 రన్స్‌‌‌‌ చేసింది. ఏడో ఓవర్‌‌‌‌ తర్వాత వర్షం వల్ల ఆట ఆగింది. అప్పటికి డక్‌‌‌‌వర్త్‌‌‌‌ లెక్కలో బంగ్లా 17 రన్స్‌‌‌‌ ముందుండటంతో ఇండియా క్యాంప్‌‌‌‌లో టెన్షన్‌‌‌‌ మొదలైంది. వాన ఆగిపోవడంతో గంట తర్వాత మ్యాచ్‌‌‌‌ మళ్లీ మొదలవగా.. డక్‌‌‌‌ వర్త్‌‌‌‌ పద్ధతిలో బంగ్లా టార్గెట్‌‌‌‌ను 16 ఓవర్లలో 151 రన్స్‌‌‌‌గా సవరించారు. అంటే మరో 9 ఓవర్లలో  బంగ్లాకు 85 రన్స్‌‌‌‌ అవసరం అయ్యాయి. లిటన్‌‌‌‌ జోరు చూస్తుంటే ఆ జట్టుకు బాగానే మొగ్గు కనిపించింది. కానీ, ఆట తిరిగి మొదలైన రెండో బాల్‌‌‌‌కే డీప్‌‌‌‌ నుంచి కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌ త్రో తో లిటన్‌‌‌‌ ను రనౌట్‌‌‌‌ చేయడంతో మ్యాచ్​ మలుపు తిరిగింది. బంగ్లాపై ఒత్తిడి పెరగ్గా.. ఇండియా తిరిగి రేసులోకి వచ్చింది. తర్వాత బౌలర్లు కూడా పుంజుకున్నారు. పదో ఓవర్లో మరో ఓపెనర్‌‌‌‌ శాంటో (21)ను షమీ (1/25) ఔట్‌‌‌‌ చేయగా.. 12వ ఓవర్లో అఫిఫ్‌‌‌‌ (3), షకీబ్‌‌‌‌ (13) ఇద్దరినీ వెనక్కిపంపిన అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ (2/38) బంగ్లాకు షాకిచ్చాడు.  తర్వాతి ఓవర్లో హార్దిక్‌‌‌‌ పాండ్యా (2/28).. యాసిర్‌‌‌‌ అలీ (1), మొసాదెక్‌‌‌‌ (6)ను పెవిలియన్‌‌‌‌ చేర్చాడు. ఇక, చివరి 12 బాల్స్‌‌‌‌లో  ఆ జట్టుకు 31 రన్స్‌‌‌‌ అవసరం అవగా..  తస్కిన్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (12 నాటౌట్), నురుల్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ (25 నాటౌట్‌‌‌‌) చెరో ఫోర్‌‌‌‌, సిక్స్‌‌‌‌ కొట్టినా లాభం లేకపోయింది.