బోనాలు ఆషాడమాసంలోనే ఎందుకు చేస్తారు

బోనాలు ఆషాడమాసంలోనే ఎందుకు చేస్తారు

డప్పు చప్పుళ్లు,శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఆషాడమాసమంతా ఊరూరా బోనాల జాతరే. ప్రత్యేకంగా హైదరాబాద్ లో పండుగ కోలాహలం గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు. ఇంతకీ ఆషాడంలోనే బోనాలు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం...

బోనం అంటే ఆహారం, భోజనం అని అర్థం. అమ్మవారికి నైవేద్యం వండి కుండను పసుపు, కుంకుమ, సున్నం, పువ్వులు, వేపకొమ్మలతో అలంకరించి దానిపై దీపం వెలిగిస్తారు. ఆ కుండను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. విస్తారంగా వర్షాలు కురిపించాలని, అంతా ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటారు. సంప్రదాయానికి చిహ్నమైన ఈ బోనాన్ని స్త్రీమూర్తులే త‌యారు చేస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాల‌మ్మ, పెద్దమ్మ..గ్రామ దేవతలను తమను చల్లంగా చూడలమ్మా అంటూ వేడుకుంటారు. గ్రామానికి, కుటుంబానికి ఎలాంటి ఆపద రాకూడదని మెుక్కుకుంటారు. 

ఆషాఢమాసం వచ్చిందంటే చాలు. తెలంగాణ ప్రజల మోముల్లో అవ్యక్తమైన ఆనందం వెల్లివిరుస్తుంది. తెలంగాణ పండుగ సంబరమవుతుంది. హుషారెత్తించే పాటవుతుంది. డప్పుల చప్పుడవుతుంది. పోతరాజు నృత్యమవుతుంది. భక్తి పారవశ్యమవుతుంది. స్త్రీ మూర్తుల చెంపలకు పసుపు అద్దుకుంటుంది. నుదుటన కుంకుమ బొట్టవుతుంది. బోనం నెత్తిన కిరీటమవుతుంది. ఇంట్లో సందడి సంతరించుకుంటుంది. వేపాకు తోరణమవుతుంది. అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇదో సంస్కృతిక సంబరం. ఛిద్రమైపోతూ విలపిస్తోన్న నగరానికి ఇదో ఆత్మీయ ఆలింగనం. అక్కున చేర్చుకునే ఊరడింపు. కాంక్రీటు జంగిల్‌గా మారిన నాగరిక నగరం తన ఆస్తిత్వాన్ని చాటుకుంటూ గ్రామంలా మారిపోతుంది. మాసమంతా పల్లె పడుచు అందాన్ని సంతరించుకుంటుంది.. ఆనందంతో గంతులేస్తుంది.

ఆషాడంలోనే ఎందుకు

ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని  భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మను తమ ఇంటికి వచ్చిన ఆడబిడ్డలా భావించి భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. ఇప్పుడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను, మేకపోతులను  బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.  బోనాలు తీసుకెళుతున్న మహిళలపై అమ్మవారు ఉంటుందని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది .. అందుకే  ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయాన్ని సమీపించగానే వారి పాదాలపై భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు.

ALSOREAD:కవిత, కేటీఆర్ లపై సుఖేష్‌ చంద్రశేఖర్‌ సంచలన ఆరోపణ

 ఆషాడమాసం వర్షాలు విరివిగా కురవడంతో క్రిమికీటకాలు, వైరస్ ద్వారా అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. పూర్వకాలంలో వైద్యవిజ్ఞాన శాస్త్రం పరిణతి చెందక ప్రచారం  కాలంలో పల్లెటూర్లలో ప్లేగు, కలరా, మశూచి, వంటి అంటు వ్యాధులు ప్రబలి గ్రామాలకు గ్రామాలే స్మశానాలుగా మారిపోయేవి. దానినే గత్తర వచ్చింది అనేవారు.ఈ వైపరీత్యాల నుంచి కాపాడాలంటూ గ్రామదేవతలను ఆరాధిస్తారు. ఆ ఆరాధనకు ఉపయోగించే వస్తువులన్నీ వైరస్ ను నిర్మూలించేవే.  వేపాకులు, పసుపునీళ్లు ఇవన్నీ వైరస్ వ్యాప్తిని నిరోధిస్తాయి. 

పోతురాజు ఎవరు

దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజు ముందునడుస్తుండగా అమ్మకు బోనం సమర్పిస్తారు. ఒంటిపై పసుపు, నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.  భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నాట్యం చేస్తాడు. ఈ పూజాకార్యక్రమాలకు ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా పోతురాజుని భావిస్తారు.

 జులై 17 వరకూ బోనాలు

కులీకుతుబ్‌ షాల కాలంలో ప్రారంభమైన బోనాలు ప్రతి సంవత్సరం రాజదానిలో సుమారు నెలరోజుల పాటు వైభవోపేతంగా జరుగుతాయి.  గోల్కొండ ఖిల్లాలోని జగదాంబికా ఆలయంలో జరిగే బోనాలకు అయిదు వందల ఏళ్ల, సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సుమారు రెండువందల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. భాగ్యనగరంలో బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలో మొదలై లష్కర్ బోనాలుగా పిలిచే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయంలో మొదలైన ఘటాల ఊరేగింపు ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగి  నయాపుల్ వద్ద ఘటాల నిమజ్జనంతో ముగుస్తుంది.  ఈ ఏడాది బోనాల ఉత్సవాల్లో భాగంగా  జులై 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో తొట్టెల ఊరేగింపు జరుగుతుంది. ఆ రోజుతో బోనాలు ముగుస్తాయి.