అకస్మాత్తుగా 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ స్టాక్.. డోన్ట్ వర్రీ ఇన్వెస్టర్స్, ఇదే అసలు విషయం..

అకస్మాత్తుగా 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ స్టాక్.. డోన్ట్ వర్రీ ఇన్వెస్టర్స్, ఇదే అసలు విషయం..

టాటా మోటర్స్ షేర్ అక్టోబర్ 14, 2025న దాదాపు 40% పడిపోవడం మార్కెట్లో కలకలం రేపింది. అయితే ఒక్కరోజే స్టాక్ ధర పతనం చాలా మంది పెట్టుబడిదారులను ఆందోళన కలిగించినప్పటికీ అది వాస్తవమైన పతనం కాదు.  అయితే దీనికి అసలు కారణాన్ని పరిశీలిస్తే.. టాటా మోటార్స్ ఇటీవల తన కమర్షియల్ వాహనాల విభాగాన్ని విడిగా ప్రత్యేక సంస్థగా మార్చింది. దీంతో ప్యాసింజర్ వాహనాలు మరో కంపెనీగా మారింది. 

ప్రస్తుతం రెండు వేరువేరు కంపెనీలుగా విభజన కావటంతో రికార్డ్ తేదీ అక్టోబర్ 14న టాటా మోటార్స్ కంపెనీలో 100 షేర్లు కలిగి ఉన్న పెట్టుబడిదారులకు కొత్తగా ఏర్పడిన టాటా ప్యాసింజర్ వాహన కంపెనీలో 100 షేర్లు అలాగే కమర్షియల్ వాహన కంపెనీలో 100 షేర్లు అలాట్ అయ్యాయి. దీంతో రూ.660 వద్ద ఉన్న షేరు రేటు రెండింటి మధ్య సర్థుబాటు చేయబడింది. దీంతో టాటా మోటార్స్ కంపెనీ షేరు రేటు బీఎస్ఈలో రూ.394 వద్ద ఇవాళ ఇంట్రాడేలో కొనసాగుతోంది.

ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఉన్న టాటా మోటార్స్ స్టాక్ కేవలం ప్యాసింజర్ వాహనాల యూనిట్ విలువను మాత్రమే ప్రతిబింబిస్తోంది. త్వరలోనే కమర్షియల్ వాహన యూనిట్ విలువతో వేరే స్టాక్ లిస్ట్ కాబోతోంది. కాబట్టి ఇందుకోసం తగ్గించిన విలువ వల్ల షేర్ హోల్డర్లకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కొత్త సంస్థ లిస్టింగ్ తర్వాత ఆ కోల్పోయిన విలువకు సమానమైన కమర్షియల్ బిజినెస్ షేర్లు అందించబడతాయని తెలుస్తోంది. ఇది కేవలం రెండు కంపెనీలు స్వతంత్రంగా పోటీతత్వాన్ని కలిగి ముందుకెళ్లేందుకు మరింత ఫోకస్ గా వ్యాపారాన్ని నడపటానికి చేసిన చర్యని నిపుణులు చెబుతున్నారు. 

అంటే ప్రస్తుతం టాటా మోటార్స్ స్టాక్ రేటు పతనం కేవలం సాంకేతిక మార్పు మాత్రమే అని పెట్టుబడిదారులు గుర్తించాలి. దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఇది భవిష్యత్తులో వృద్ధికి మార్గం చేస్తుందని గమనించాలి. డీమర్జర్ పూర్తయిన తర్వాత రెండు కంపెనీల షేర్లు కూడా మార్కెట్లో వేర్వేరుగా లాభదాయకంగా ముందుకు సాగుతాయని నిపుణులు చెబుతున్నారు.