సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామంలో ఎండిన పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. పంట పొలాలను పరిశీలించే క్రమంలో రైతులతో కావాలనే ఫోటోలకు, వీడియోలు ఫోజులు ఇచ్చే విధానాన్ని వివరించిన బొల్లం మల్లయ్య వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు. ‘సానుభూతి కోసం ఆరాట పడి కొత్త సమస్య కొని తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే’ అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
సెప్టెంబర్17న జరిగిన రైతుల పంట పొలాల పరిశీలనలో భాగంగా కోదాడ మండలంలో గణపవరం,ఎర్రవరం,రామ లక్ష్మి పురం,బిక్య తండా తొగర్రాయి పలు గ్రామాలలో ఎడమ కాలువ ఆయ కట్టు కింద ఎండిపోతున్న వరి పొలాలను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య, టీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. రైతులతో కావాలని ఫోటోలు వీడియోలు తీయించే క్రమంలో ‘‘అటు పక్కకు జరుగు.. ఇటు పక్కకు జరుగు.. నెత్తిన తల పాగా కట్టుకో’’ అని రైతులతో మాజీ ఎమ్మెల్యే మాట్లాడే మాటలన్నీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడంతో ఈ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వైఖరిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.