రమ్యారెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయి..? దర్యాప్తు చేయాలని వినతి

రమ్యారెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయి..? దర్యాప్తు చేయాలని వినతి

రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిని కలిసిన కోదండరాం, ఆకునూరి మురళి

రాష్ట్రంలోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేషెంట్స్ కు అందిస్తున్న వైద్యపరీక్షలు, చికిత్సలపై పలు అనుమానాలు ఉన్నాయని ప్రొఫెసర్ కోదండరాం, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలో రమ్యారెడ్డి అనే స్టూడెంట్ కు నిర్వహించిన వైద్యపరీక్షలు, చికిత్సపై అనుమానం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని కలిసి.. వినతిపత్రం అందించారు. రమ్యారెడ్డికి నిర్వహించిన వైద్య చికిత్స, ఫీజులు, చేసిన వైద్య పరీక్షలు సరైనవా..? కావా..? అనే విషయాలపై ఎథిక్స్ కమిటీ వేసి..నిజాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్, ప్రతి జిల్లాలో వెయ్యి పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నారు. తాము సమర్పించిన 9 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని..చర్యలు తీసుకోవాలని కోరారు. 

అసలేం జరిగిందంటే..!

20 ఏళ్ల రమ్యారెడ్డి అనే విద్యార్థిని తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో ఆమె కుటుంబ సభ్యులు అక్టోబర్ 10వ తేదీన చైతన్యపురిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పిచారు. వైద్య పరీక్షలు నిర్వహించిన సదరు ఆస్పత్రి వైద్యులు డెంగ్యూ జ్వరమని నిర్ధారించారు. అయితే..ఆస్పత్రి వైద్య సిబ్బంది సరైన ట్రీట్ మెంట్ అందించలేదని మలక్ పేటలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి 12వ తేదీన తీసుకెళ్లారు. ఈ ఆస్పత్రి యాజమాన్యం రమ్యారెడ్డి తల్లిదండ్రుల నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినా ఆమె ప్రాణాన్ని మాత్రం కాపాడలేకపోయింది. మలక్ పేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో అక్టోబర్ 14వ తేదీన చనిపోయింది. 

రమ్యారెడ్డి మరణంపై అనుమానాలు..!

రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో రమ్యారెడ్డికి జరిగిన ట్రీట్ మెంట్, జరిపిన వైద్య పరీక్షలపై ఆమె తల్లిదండ్రులతో పాటు, ప్రజలకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయని, కార్పొరేట్ ఆస్పత్రుల మీద కూడా అనుమానాలు ఉన్నాయంటూ కోదండరాం, ఆకునూరి మురళి వినతిపత్రంలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే.. రమ్యారెడ్డి తండ్రి కూతురు చికిత్స కోసం లక్షల రూపాయలు అప్పు చేశాడని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏమైనా ఉందా..? లేదా అనే విషయంపై కూడా రాష్ట్ర ప్రజలకు అనుమానాలు ఉన్నాయని వినతిపత్రంలో వివరించారు. రమ్యారెడ్డికి ముందుగా వైద్యం చేసిన ఆస్పత్రి, ఆ తర్వాత చికిత్స అందించిన ఆస్పత్రిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని కోరారు. 

* జీహెచ్ఎంసీ జోన్ కు, ప్రతి జిల్లాకు ఒక ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేసి, ఇలాంటి అనుమానాస్పద కేసులను దర్యాప్తు చేసేటట్ల తగు చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ జీవో విడుదల చేయాలని వినతిపత్రంలో కోరారు. అన్ని వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది పోస్టులను వెంటనే నియమించాలని కోరారు. 

* వైద్య రంగానికి సంబంధించిన పాత చట్టాలను పరిగణలోకి తీసుకుని.. సమగ్రమైన కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలని కోరారు. ప్రజలకు అతి తక్కువ ఖర్చుకే మెరుగైన వైద్యం అందించాలని, నిరుపేదలకు పూర్తిగా ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని కోరారు. 

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని కలిసిన వారిలో రిటైర్డ్ ఐఏఎస్, ఎస్ డీఎఫ్ కన్వీనర్ ఆకునూరి మురళి, టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ విఠల్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ఆమ్ ఆద్మీ కోర్ కమిటీ సభ్యురాలు ఇందిరా శోభన్, టీడీపీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న తిరునగరి, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, బీఎస్సీ మహిళా నాయకురాలు అరుణ క్వీన్, సీనియర్ జర్నలిస్టు సతీష్ కమల్, సామాజిక కార్యకర్త రాజేష్ రెడ్డి ఉన్నారు.