కోహీర్​లో జూనియర్​ అసిస్టెంట్​ఏసీబీకి చిక్కిండు

కోహీర్​లో జూనియర్​ అసిస్టెంట్​ఏసీబీకి చిక్కిండు

మునిపల్లి (కోహీర్​), వెలుగు: సంగారెడ్డి జిల్లా కోహీర్​ మండలం కవేలి గ్రామానికి చెందిన ఓ రైతుకు భూ రికార్డులు ఇవ్వడానికి  లంచం తీసుకుంటూ తహసీల్దార్​ఆఫీసులోని జూనియర్ అసిస్టెంట్​ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ కథనం ప్రకారం..కవేలి గ్రామానికి చెందిన గడ్డమీది రాజుకు ఎకరా 20 గుంటల భూమి ఉంది. 

2021కి ముందు ఇతడికి రైతుబంధు వచ్చేది. ఆ తర్వాత  రైతుబంధు పడకపోవడంతో కలెక్టరేట్, తహసీల్దార్​ ఆఫీసులకు వెళ్లగా ఆ భూమి  వక్ఫ్ బోర్డులో ఉందని, అందుకే రావడం లేదని చెప్పారు. దీంతో ఆ భూమికి సంబంధించిన రికార్డులు కావాలని దరఖాస్తు పెట్టుకోవడంతో జూనియర్​ అసిస్టెంట్ శ్రీకాంత్​రెడ్డి​  రూ.4 వేలు డిమాండ్​ చేశాడు. 

దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. జహీరాబాద్​లో  కలిసి డబ్బులు ఇవ్వాలని శ్రీకాంత్​ రెడ్డి రాజుకు  చెప్పడంతో శుక్రవారం జహీరాబాద్ వెళ్లాడు. అక్కడ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్​ చేసి రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. శ్రీకాంత్​ రెడ్డిని అదుపులోకి  తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ  ఆనంద్​ కుమార్​ తెలిపారు. డీఎస్పీ వెంట సీఐ వెంకట రాజాగౌడ్,రమేశ్ ఉన్నారు.