బ్రెయిన్ డెడ్ తల్లి కోరిక తీర్చటానికి ఆస్పత్రిలోనే కూతురి పెళ్లి !

బ్రెయిన్ డెడ్ తల్లి కోరిక తీర్చటానికి ఆస్పత్రిలోనే కూతురి పెళ్లి !

ఒక్క రోడ్డు ప్రమాదం కన్న తల్లి ఆశలను చిదిమేసింది. కూతురి పెళ్లి బాధ్యతను నెరవేర్చి, కన్న కూతురి పెళ్లిని కళ్లారా చూసి.. ఆ తర్వాత తనకు ఏమైనా పర్లేదనుకున్న తల్లి కోరిక అరకొరగా తీరిన ఘటన ఇది. బ్రెయిన్ డెడ్ అయిన స్థితిలో ఉన్న కన్న తల్లి కళ్ల ముందు కూతురు పెళ్లి చేసుకున్న హృదయ విదారక ఘటన పశ్చిమ బెంగాల్లో వెలుగుచూసింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కోల్‌కత్తాకు చెందిన 54 ఏళ్ల చుమ్కి రాయ్ అనే వృద్ధురాలు, తన కూతురి పెళ్లిని చూడాలని ఆశపడింది. ఆమె కోరుకున్నట్టుగానే కూతురి పెళ్లి కుదిరింది. రేపోమాపో పెళ్లనగా.. చుమ్కి రాయ్ ఆశలను దురదృష్టం వెక్కిరించింది. గత సోమవారం (అక్టోబర్ 26, 2026) ఆమెకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో, ఆమెను రూబీ జనరల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఆమె పరిస్థితి చేయి దాటిపోయింది. బుధవారం రాత్రి ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ క్రమంలో.. ఆమె కుటుంబం ఆమె అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకుంది. అదే క్రమంలో.. ఆమె కోరిక ప్రకారం కూతురి పెళ్లిని కూడా ఆమె కళ్ల ముందే చేయాలని ఆమె భర్త దేబబ్రత రాయ్ నిర్ణయించారు. కోల్‌కతాలోని సదరు ప్రైవేట్ ఆసుపత్రి కూడా సానుకూలంగా స్పందించడంతో.. అవయవాలను సేకరించే ముందు, ఆమె కూతురి పెళ్లికి హాస్పిటల్ వేదికైంది. చుమ్కి వెంటిలేటర్పై ఉండగానే ఆసుపత్రిలో ఆమె సమక్షంలోనే ఆమె కూతురి పెళ్లి జరిగింది. మొత్తానికి ఇలా.. ఆమె కోరిక కొంతైనా తీరింది.

►ALSO READ | కవాసకి టీమ్‌కు నాగాలాండ్ విద్యార్థుల గ్రాండ్ వెల్‌కమ్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

చుమ్కి రాయ్ కాలేయం, రెండు మూత్రపిండాలు, కార్నియాలను దానం చేశారు. ఆమె కాలేయాన్ని అపోలో ఆసుపత్రిలో సిర్రోసిస్‌తో బాధపడుతున్న రోగికి కేటాయించగా, ఆమె మూత్రపిండాలను రూబీ ఆసుపత్రి, కమాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులకు మార్పిడి చేశారు. శంకర నేత్రాలయలోని కంటి బ్యాంకు రెండు కార్నియాలను సేకరించింది.