డాక్టర్ల సమ్మె దేశమంతా పాకింది

డాక్టర్ల సమ్మె దేశమంతా పాకింది

 

కోల్​కతా/ న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లో తమకు సెక్యూరిటీ కల్పించాలన్న డిమాండ్​తో వెస్ట్​ బెంగాల్​లో జూనియర్​ డాక్టర్లు చేపట్టిన నిరసనోద్యమం దేశమంతటా విస్తరించింది. ఇండియా నలుమూలల్లోని దాదాపు అన్ని సిటీల్లో శుక్రవారం జూనియర్​ డాక్టర్లు విధులు బహిష్కరించారు. హైదరాబాద్ సహా అన్ని ముఖ్య నగరాల్లో శాంతి ర్యాలీలు చేపట్టారు. జూనియర్ల సమ్మెకు మద్దతుగా వందల మంది

సీనియర్​ డాక్టర్లు ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. అతి పెద్ద డాక్టర్ల సంఘమైన ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​(ఐఎంఏ).. దేశవ్యాప్తంగా ఒక్క రోజు(సోమవారం) సమ్మెకు పిలుపిచ్చింది. జూనియర్​ డాక్టర్లు సమ్మెబాట పట్టడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని ప్రధాన ఆస్పత్రులు, కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ కేసులు తప్ప మిగతా వైద్యసేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోల్​కతా సిటీలో సమయానికి ట్రీట్​మెంట్ అందక ఒకరిద్దరు చిన్నారులు చనిపోవడం అందర్నీ కలిచివేసింది. బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ తీరువల్లే డాక్టర్ల ఆందోళన ఉధృతమైందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ ఆరోపించారు. సమ్మె వల్ల పేద రోగులు చనిపోతున్నారని, డాక్టర్లు డ్యూటీల్లో చేరేలా ఆదేశాలివ్వాలంటూ సామాజిక కార్యకర్తలు కోల్​కతా హైకోర్టులో పిల్​ దాఖలు చేయగా, దీనిపై మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని చీఫ్​ జస్టిస్​ రాధాకృష్ణన్​ నేతృత్వంలోని డివిజన్​ బెంచ్ పేర్కొంది. ఆస్పత్రుల్లో డాక్టర్ల సెక్యూరిటీపై కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో మరో పిల్​ దాఖలైంది. కోల్​కతాలోని నీల్​ రతన్​ సర్కార్(ఎన్​ఆర్​ఎస్​) మెడికల్​ కాలేజ్​ ఆస్పత్రిలో సోమవారం రాత్రి చనిపోయిన ఓ పేషెంట్​ బంధువులు.. డ్యూటీలో ఉన్న ఇద్దరు జూనియర్ డాక్టర్లను చితకబాదడం, ఆ దాడిని నిరసిస్తూ, ఆస్పత్రుల్లో తమకు రక్షణ కల్పించాలంటూ జూడాల సంఘం సమ్మెకు దిగడం తెలిసిందే. మొదట కోల్​కతాకే పరిమితమైన ఆందోళనలు.. శుక్రవారం నాటికి దేశవ్యాప్త  ఉద్యమంగా మారింది.

సమ్మెలో మమత మేనల్లుడు​

జూనియర్​ డాక్టర్ల సమ్మెకు కేంద్రబిందువుగా  కోల్​కతాలోని ఎన్​ఆర్​ఎస్​ మెడికల్​ కాలేజ్​ ఆస్పత్రిలో నాలుగో రోజైన శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. సిటీలోని ఇతర మెడికల్​ కాలేజీలు, ఆస్పత్రుల్లోని జూనియర్‌ డాక్టర్లు ర్యాలీగా వచ్చి సమ్మె చేస్తున్న సహచరులకు మద్దతు పలికారు.  సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు డాక్టర్​ అభేశ్‌ బెనర్జీ కూడా సమ్మెలో పాల్గొన్నారు. ‘‘ఒకప్పుడు డాక్టర్లని దేవుళ్లు(గాడ్స్) అన్నారు.. ఇప్పుడేమో కుక్కల(డాగ్స్​)లాగా ట్రీట్​ చేస్తున్నారు’’అని రాసున్న పోస్టర్​తో అభేశ్ నిరసన తెలిపారు. వెస్ట్​బెంగాల్​ అసెంబ్లీ స్పీకర్​ బిమన్​ బెనర్జీ కూడా డాక్టర్లపై దాడిని ఖండిచారు.

అయ్యో బిడ్డా..

నాలుగు రోజులుగా డాక్టర్లు సమ్మె చేస్తుండటంతో వెస్ట్​బెంగాల్​లోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో రోగుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. రోజుల వయసున్న కూతురి మృతదేహంతో ఆస్పత్రి నుంచి బయటికొస్తూ ఏడుస్తున్న ఓ తండ్రి ఫొటో అందరిచేతా కన్నీరు పెట్టించింది. సేవ్​ డాక్టర్స్​, సేవ్​ బెంగాల్​ నినాదాల మధ్య చిన్నారులు బలైపోతున్నారంటూ సోషల్​ మీడియాలో ఆవేదన వ్యక్తమైంది.

దీదీ సారీ చెప్పాల్సిందే

తమ నిరసనోద్యమాన్ని అవమానించేలా మాట్లాడిన సీఎం మమతా బెనర్జీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డాక్టర్ల యూనియన్లు డిమాండ్​ చేశాయి. సీఎం సారీ చెప్పకుంటే ఎమర్జెన్సీ సేవల్ని కూడా నిలిపేస్తామని వార్నింగ్​ ఇచ్చాయి. గురువారం ఎన్​ఆర్​ఎస్​ మెడికల్​ కాలేజీకొచ్చిన సీఎం మమత.. సమ్మె విరమించకుంటే సీరియస్​ యాక్షన్​ తీసుకుంటానంటూ జూనియర్​ డాక్టర్లకు అల్టిమేటం జారీచేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లే సమ్మె చేస్తున్నారని, ఇదంతా బెంగాల్​ను బద్నాం చేయడానికి బీజేపీ, కేంద్రం కలిసిపన్నిన కుట్ర అని ఆరోపించారు. సీఎం కామెంట్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆరు డిమాండ్లతో జూనియర్​ డాక్టర్ల సంఘాలు శుక్రవారం విడుదల చేసిన నోట్​లో సారీ అంశాన్ని కూడా చేర్చారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లకు పోలీస్​ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని, ఎన్​ఆర్​ఎస్​ మెడికల్​ కాలేజ్​లో దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని నోట్​లో పేర్కొన్నారు. డాక్టర్ల సమ్మెకు మద్దతు పలికిన సీనియర్​ నటి అపర్ణాసేన్​.. సారీ చెప్పడం సిగ్గుపడాల్సిన విషయమేమీ కాదని సీఎం మమతకు సూచించారు.

300 మంది డాక్టర్ల రాజీనామా

అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లకు సెక్యూరిటీగా పోలీసుల్ని మోహరింపజేయాలన్న జూనియర్ల డిమాండ్​కు సీనియర్​ డాక్టర్లు మద్దతు పలికారు. సర్కార్​ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 మంది డాక్టర్లు, మెడికల్​ కాలేజీ సిబ్బంది తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఒక్క ఎస్​ఎస్​కేఎం హాస్పిటల్​లోనే అత్యధికంగా 175 మంది డాక్టర్లు రిజైన్ చేశారు.

సోమవారం డాక్టర్ల బంద్​

వెస్ట్​బెంగాల్​లో జూనియర్​ డాక్టర్లపై దాడిని ఐఎంఏతీవ్రంగా ఖండించింది. దేశవ్యాప్తంగా మూడురోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చింది. సోమవారం (జూన్‌‌ 17న) అన్ని ఆస్పత్రుల్లో సేవలు నిలిపేస్తామని ప్రకటించింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ తప్ప మిగతా విభాగాలేవీ పనిచేయబోవని ఐఎంఏ బాధ్యులు వెల్లడించారు. బంద్​లో ప్రైవేటు డాక్టర్లు కూడా పాల్గొంటారన్నారు. బంద్​కు ముందు శని, ఆదివారాల్లో నల్లబ్యాడ్జ్​లు, నిరసన ర్యాలీలు, ధర్నాలు చేస్తామన్నారు.  డాక్టర్లపై దాడులు చేయడం సరికాదని, తగిన సెక్యూరిటీ కల్పించాలన్నదే తమ డిమాండ్​ అని ఐఏంఏ పేర్కొంది.

హైదరాబాద్​లోనూ జూడాల నిరసనలు

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా హైదరాబాద్​లోని అన్ని ప్రభుత్వాసు పత్రుల్లోజూనియర్​ డాక్టర్లు కొద్ది గంటలపాటు విధులు బహిష్కరిం చారు. ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంఎన్జే, నిమ్స్, ఎర్రగడ్డ మెంటల్, చెస్ట్ హాస్పిటల్, సరోజిని దేవి ఐ హాస్పిటల్ లో ర్యాలీలు, దీక్షలు చేశారు.తలకు కట్లు కట్టు కుని నిరసన తెలిపారు. దీనికి సీనియర్​ డాక్టర్లు , మెడికల్ ప్రొఫెసర్లు మద్దతుపలికారు.డాక్టర్లపై దాడులు జరగకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఉస్మానియా జూనియర్డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ డిమాండ్ చేశారు.గాంధీ ఆస్పత్రిలో నల్లబ్యాడ్జ్​లు ధరించిడ్యూటీకొచ్చిన జూనియర్​ డాక్టర్లు ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు.