విన్‌‌ రైడర్స్‌‌ .. ఐపీఎల్‌‌లో కోల్‌‌కతా రెండో విజయం

విన్‌‌ రైడర్స్‌‌ .. ఐపీఎల్‌‌లో కోల్‌‌కతా రెండో విజయం
  • 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపు
  • నరైన్‌‌, వెంకటేశ్‌‌ విధ్వంసం
  • కోహ్లీ హాఫ్‌‌ సెంచరీ వృథా

బెంగళూరు: బ్యాటింగ్‌‌లో సునీల్‌‌ నరైన్‌‌ (22 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 47), వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ (30 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 50) దంచికొట్టడంతో.. ఐపీఎల్‌‌లో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ రెండో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై గ్రాండ్‌‌ విక్టరీని సాధించింది. టాస్‌‌ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 182/6 స్కోరు చేసింది. విరాట్‌‌ కోహ్లీ (59 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 83*), కామెరూన్‌‌ గ్రీన్‌‌ (33), మ్యాక్స్‌‌వెల్‌‌ (28) మెరుగ్గా ఆడారు. తర్వాత కోల్‌‌కతా 16.5 ఓవర్లలోనే 186/3 స్కోరు చేసింది. కెరీర్​లో 500ల టీ20 మ్యాచ్​ ఆడిన నరైన్‌‌, సాల్ట్‌‌ 8 ఓవర్లలోనే 92 రన్స్‌‌ జత చేసి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తర్వాత వెంకటేశ్‌‌ కీలక పార్ట్​నర్​షిప్​తో ఈజీగా విజయాన్ని అందించాడు. శ్రేయస్‌‌ (39*) రాణించాడు. నరైన్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

ఆరంభం అదుర్స్‌‌.. 

లక్ష్య ఛేదనలో కోల్‌‌కతాకు నరైన్‌‌, ఫిల్‌‌ సాల్ట్‌‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. సిరాజ్‌‌ వేసిన తొలి ఓవర్‌‌లోనే సాల్ట్‌‌ 6, 4, 6తో 18 రన్స్‌‌ రాబట్టాడు. యష్‌‌ దయాల్‌‌ (1/46) ఓవర్‌‌లో ఒక్క ఫోర్‌‌తో సరిపెట్టినా, తర్వాతి ఓవర్‌‌ నుంచి నరైన్‌‌ జోరందుకున్నాడు. 6, 6, 4, 6, 4, 6, 6 దంచడంతో పవర్‌‌ప్లేలో కేకేఆర్‌‌ 85/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే ఏడో ఓవర్‌‌లో నరైన్‌‌ విధ్వంసానికి మయాంక్‌‌ డాగర్‌‌ (1/23) అడ్డుకట్ట వేశాడు.

బలమైన యార్కర్‌‌తో నరైన్‌‌ను క్లీన్‌‌బౌల్డ్‌‌ చేయడంతో తొలి వికెట్‌‌కు 86 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. 8వ ఓవర్‌‌లో సాల్ట్‌‌ను వైశాక్‌‌ (1/23) ఔట్‌‌ చేయడంతో కోల్‌‌కతా 92/2 స్కోరుతో నిలిచింది. ఈ దశలో వచ్చిన వెంకటేశ్‌‌ అయ్యర్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్‌‌ ఎక్కడా తగ్గలేదు. వెంకటేశ్‌‌ సిక్స్‌‌తో, శ్రేయస్‌‌ ఫోర్‌‌తో టచ్‌‌లోకి వచ్చారు. ఈ ఇద్దరు సింగిల్స్‌‌ కూడా తీయడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లోనే కోల్‌‌కతా 112/2 స్కోరు చేసింది.

11వ ఓవర్‌‌లో వెంకటేశ్‌‌ 6, 4, 6, 4తో 20 రన్స్‌‌తో బ్యాట్‌‌ ఝుళిపించాడు. తర్వాతి మూడు ఓవర్లలో 18 రన్స్‌‌ వచ్చినా 15వ ఓవర్‌‌లో శ్రేయస్‌‌, వెంకటేశ్ చెరో సిక్స్‌‌ బాదడంతో స్కోరు 167/2గా మారింది. ఇక 30 బాల్స్‌‌లో 16 రన్స్‌‌ చేయాల్సిన దశలో 16వ ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కు వెంకటేశ్‌‌ ఔట్‌‌కావడంతో మూడో వికెట్‌‌కు 75 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. రింకూ సింగ్‌‌ (5*)తో కలిసి శ్రేయస్‌‌ విన్నింగ్‌‌ సిక్సర్‌‌తో విజయానికి అవసరమైన రన్స్‌‌ జత చేశాడు. 

కోహ్లీ సూపర్‌‌..

సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న కోహ్లీ ఈసారి కూడా ఆర్‌‌సీబీ ఇన్నింగ్స్‌‌కు వెన్నెముకగా నిలిచాడు. తొలి బాల్‌‌ను ఫోర్‌‌గా మలిచి ఖాతా తెరిచిన అతను ఇన్నింగ్స్‌‌ చివరి వరకు క్రీజులో ఉండి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రెండో ఓవర్‌‌లో సిక్స్‌‌ కొట్టి డుప్లెసిస్‌‌ (8).. హర్షిత్‌‌ రాణా (2/39)కు వికెట్‌‌ ఇవ్వగా, కొత్తగా వచ్చిన గ్రీన్‌‌ మెరుపు ఇన్నింగ్స్‌‌ ఆడాడు. థర్డ్‌‌ ఓవర్‌‌లో విరాట్‌‌ 6, 4 బాదితే, ఆ తర్వాత  గ్రీన్‌‌ 4, 4, 4, 6తో  జోరు పెంచాడు. దీంతో పవర్‌‌ప్లేలో బెంగళూరు 61/1 స్కోరు చేసింది. 8వ ఓవర్‌‌లో విరాట్‌‌ సిక్స్‌‌తో రన్‌‌రేట్‌‌ను కాపాడు. కానీ 9వ ఓవర్‌‌లో రసెల్‌‌ (2/29) దెబ్బకు గ్రీన్‌‌ వెనుదిరగడంతో రెండో వికెట్‌‌కు 65 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది.

ఉన్నంతసేపు మ్యాక్స్‌‌వెల్‌‌ కూడా వేగంగా ఆడటంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో ఆర్‌‌సీబీ 85/2 స్కోరు చేసింది. 12వ ఓవర్‌‌లో విరాట్‌‌ 6, మ్యాక్సీ 4, 4తో 17 రన్స్‌‌ దంచారు. 14వ ఓవర్‌‌లో మ్యాక్స్‌‌వెల్‌‌ 6, 4 కొట్టినా నరైన్‌‌ (1/40) క్యాచ్‌‌ డ్రాప్‌‌ చేయడంతో బతికిపోయాడు. అయితే మూడో వికెట్‌‌కు 42 రన్స్‌‌ జోడించి 15వ ఓవర్‌‌లో మ్యాక్స్‌‌వెల్‌‌ ఔటయ్యాడు. 134/3 స్కోరు వద్ద వచ్చిన రజత్‌‌ పటీదార్‌‌ (3), అనూజ్‌‌ రావత్‌‌ (3) ఆరు బాల్స్‌‌ తేడాలో పెవిలియన్‌‌కు చేరడంతో ఆర్‌‌సీబీ 151/5తో నిలిచింది. ఈ దశలో దినేశ్‌‌ కార్తీక్‌‌ (8 బాల్స్‌‌లో 3 సిక్స్‌‌లతో 20*), కోహ్లీ పోటీపడి సిక్సర్లు కొట్టారు. ఈ ఇద్దరు నాలుగు సిక్స్‌‌లు బాదడంతో ఆరో వికెట్‌‌కు 15 బాల్స్‌‌లోనే 31 రన్స్‌‌ జతయ్యాయి. ఓవరాల్‌‌గా చివరి 5 ఓవర్లలో 48 రన్స్‌‌ రావడంతో ఆర్‌‌సీబీ మంచి టార్గెట్‌‌ను ఉంచింది.