
ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం (మే 7) చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటింగ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సమిష్టిగా రాణించింది. ప్లే ఆఫ్స్ రేస్ కు చేరాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది. రహానే (48), రస్సెల్ (38), మనీష్ పాండే (36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రహానే (48) టాప్ స్కోరర్ గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, కంబోజ్ తలో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా రెండో ఓవర్లోనే గుర్బాజ్ వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ రహానే, నరైన్ దూకుడుగా ఆడారు. పవర్ ప్లే లో ఇద్దరూ చెలరేగి ఆడడంతో తొలి 6 ఓవర్లలో 67 పరుగులు రాబట్టింది. పవర్ ప్లే తర్వాత నరైన్ భారీ షాట్ కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. రహానే, మనీష్ పాండే కలిసి స్వల్ప బాగాస్వామ్యాన్ని నెలకొల్పి కేకేఆర్ ను భారీ స్కోర్ దిశగా నడిపించారు. 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రహానే రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది.
►ALSO READ | Rohit Sharma: సుదీర్ఘ ఫార్మాట్‌కు ఇక గుడ్ బై: టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ
సూపర్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మిడిల్ ఓవర్స్ లో పరుగుల వేగం మందగించింది. అయితే కాసేపటికే రస్సెల్ తన పవర్ హిట్టింగ్ తో స్టేడియాన్ని హోరెత్తించాడు. భారీ షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. రస్సెల్ ఔట్ కావడంతో చివర్లో చెన్నై బౌలర్లు పుంజుకున్నారు. చివరి ఓవర్లో 6 పరుగులే రావడంతో కోల్‌కతా 179 పరుగులకే పరిమితమైంది. చివరి వరకు క్రీజ్ లో ఉన్న మనీష్ పాండే 28 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.