
- రహదారుల నిర్మాణంలో టెక్నాలజీని వాడతాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- ప్రమాదాల నివారణపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా అనుసరి స్తున్న అధునాతన రోడ్డు నిర్మాణ పద్ధతులను రాష్ట్రం లో అమలు చేస్తామని ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అందుకోసం స్మార్ట్ రోడ్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఫ్యూచరిస్టిక్ ఆటోమేటెడ్ కన్‌స్ట్రక్షన్, ఐసీటీ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగిస్తామని చెప్పారు. సోమవారం సెక్రటేరియెట్‌లో ప్రపంచ బ్యాంకు ప్రతి నిధితో మంత్రి వెంకట్‌రెడ్డి సమావేశమయ్యారు.
ప్రపంచ బ్యాంకు సహకారంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రోడ్ల నిర్మాణాలు, వాటి తీరుతెన్నులపై పీపీటీ రూపంలో ప్రపంచ బ్యాంక్ రవాణారంగ అధికారిణి రీనూ అనుజా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వందల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించలేదని, ప్రమాద బాధితులకు చికిత్స అందించేందుకు కనీసం ట్రామాకేర్ సెంటర్స్‌ను కూడా నిర్మించలేదని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గుర్తించి.. అత్యంత ప్రమాదకరంగా ఉన్న హైవేలపై ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్-, విజయవాడ హైవేపై ట్రామాకేర్ సెంటర్ నిర్మాణంలో ఉందన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రపంచబ్యాంకు సహకారంపై ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రత్యేక ప్రణాళికలతో వస్తే.. మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుందామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు మంత్రి వివరించారు.
ఐసీటీ ఉపయోగించి ప్రమాదాలు నివారించొచ్చు..
అంతకుముందు ప్రపంచ బ్యాంక్ రవాణారంగ అధికారిణి రీనూ అనుజా రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మంత్రికి వివరించారు. తమిళనాడు, రాజస్థాన్, కర్నాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ)ని ఉపయోగించి రోడ్డు ప్రమాదాలను ఎలా నివారించారు? ఎంతశాతం మరణాల రేటు తగ్గిందన్న విషయాలను గణాంకాలతో తెలిపారు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఆధారిత విధానాన్ని అనుసరించడం వల్ల ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విజన్‌కు అనుగుణంగా అర్బన్ ఏరియాలను.. రూర్బన్‌కు విస్తరించడం, మెగా క్లస్టర్స్ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలను నగరాలతో అనుసంధానించడం, విమెన్ స్కిల్లింగ్ హబ్స్ ఏర్పాటు వంటి నూతన విధానాలను రూపొందించడం ద్వారా రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయొచ్చని తన ప్రజెంటేషన్‌లో ఆమె వివరించారు. మరోవైపు రాష్ట్రంలో ఇన్నోవేటివ్ ఫైనాన్స్ మోడల్ ద్వారా ఆర్థిక సహకారం అందించేందుకు అనువైన ప్రాజెక్టుల గురించి వివరించారు.