ప్రగతిభవన్​ పేల్చేస్తామనడం సరికాదు: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

ప్రగతిభవన్​ పేల్చేస్తామనడం సరికాదు: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్లగొండ, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిది పాద యాత్ర కాదని, ఆయనది సగం కారు యాత్ర.. సగం పాదయాత్ర అన్నట్లుగా ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనాలు లేనివద్ద కారులో.. జనం ఉన్న చోట పాదయాత్ర చేస్తు న్నారని అన్నారు. ప్రగతి భవన్‌ను పేల్చేయాలని రేవంత్ కామెంట్ చేసి ఉండకూడదన్నారు. ప్రగతిభవన్ కేసీఆర్ సొంత ఆస్తి కాదని అది ప్రజల ఆస్తి అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దానిని ప్రజా దర్బార్‌గానో, ఆసుపత్రి గానో మారుస్తామని చెప్పి ఉంటే బాగుండేది అన్నారు. ఈ నెల 13న పార్లమెంట్ సమా వేశాలు ముగియగానే పార్టీ స్టార్ క్యాంపైనర్ హోదాలో దక్షిణ తెలంగాణలోని 50 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పూర్తిగా బైక్​యాత్ర చేస్తానని వివరించారు. ఖమ్మం, మహబూబ్​నగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో తన పర్యటన కొనసాగుతుందని పేర్కొన్నారు.

రూ.100 కోట్ల భూమిలో బీఆర్​ఎస్ ఆఫీసా

నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి, సీఎం కేసీఆర్​కు పోయే కాలం దగ్గర పడిందని వెంకట్​ రెడ్డి అన్నారు. రూ.100 కోట్ల ప్రభుత్వ భూమిలో బీఆర్ఎస్ ఆఫీసు కట్టడం దారుణమని, ఆ ప్రాంతంలో పేదలకు డబుల్​ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి పేదలకు ఇస్తే బాగుండేదన్నారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం కట్టిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టి ప్రజల సౌకర్యార్థం ఉపయోగిస్తామన్నారు. 

కేంద్రం నిధులనే మళ్లించి అభివృద్ధి అంటున్నరు

కేంద్రం నుంచి వచ్చే నిధులే పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, ఇతర పనులకు ఖర్చు చేసి అదంతా తను చేసిన అభివృద్ధి అని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని వెంకట్ రెడ్డి విమర్శించారు. సర్పంచ్​లు చేసిన పనులకు బిల్లులు రాక రాష్ట్రంలో 30 మంది ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ అంకెలగారడిగా ఉందని, అతి త్వరలో ఎన్నికలు రానుండడంతో ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసే విధంగా బడ్జెట్ ఉందని ఎంపీ తెలిపారు.