నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదు :  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

 చండూరు, నాంపల్లి, మర్రిగూడ, వెలుగు : చండూర్ నుంచి నాంపల్లి వరకు చేపట్టే రోడ్డు విస్తరణ పనుల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కాంట్రాక్టర్లకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూచించారు. అమృత్​2.0 పథకంలో భాగంగా మంగళవారం చండూరు పట్టణంలో రూ.9.80 కోట్లతో మంచినీటి పైపులైన్​నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ చండూరు పట్టణాన్ని అద్దంలా చేసి చూపిస్తానని చెప్పారు.  

అభివృద్ధి విషయంలో రాజకీయాలకతీతంగా అందర్నీ కలుపుకొని ముందుకుకెళ్తామన్నారు. అనంతరం నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు  సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. మర్రిగూడ మండలంలోని శివన్నగూడ గ్రామం నుంచి అంతంపేటకు వెళ్లే వాగుపై రూ.91 లక్షలతో నిర్మించే వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. తిరుగండ్లపల్లి లో రూ.3.2 కోట్లతో నిర్మించిన 33/ 11 కేవీ సబ్ స్టేషన్, శివన్నగూడలో నిర్మించిన అంగన్​వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.