మునుగోడు ఎన్నిక తెలంగాణ తలరాతను మార్చుతుంది

మునుగోడు ఎన్నిక తెలంగాణ తలరాతను మార్చుతుంది

చౌటుప్పల్ : మునుగోడు ఎన్నికల కోసం కొత్త స్కీమ్​లు ప్రకటిస్తున్నారని, 100 స్కీమ్ లు పెట్టినా సీఎం కేసీఆర్ ను ప్రజలు  కేసీఆర్ ను నమ్మరని మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కొత్త పెన్షన్లు పంచారని,  కేవలం మునుగోడు లోనే 3 వ విడత గొర్రెల పంపిణీ చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ కండువా కప్పుకున్న వారికే  గొర్రెలిస్తామని  మంత్రి జగదీశ్  రెడ్డి ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో మున్సిపల్ ​కౌన్సిలర్ కామిశెట్టి శైలజాభాస్కర్ తో పాటు పలువురు బీజేపీలో  చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..   పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి జగదీశ్​రెడ్డి బుడ్డరఖాన్ లాగా మాట్లాడుతున్నారని, రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయాడంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

తాను అమ్ముడుపోయే వ్యక్తినే అయితే గతంలో 12 మంది ఎమ్మెల్యేలతోనే పార్టీ మారేవాడినని తెలిపారు.కేసీఆర్ కు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మీద ఉన్న ప్రేమ ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై లేదని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చే ఆదాయాన్నంతా కేసీఆర్ తమ సొంత నియోజకవర్గాల్లో ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో నల్లగొండ జిల్లా ప్రజలు పాల్గొనలేదా? ఎందుకు జిల్లా మీద వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధికి మంత్రి జగదీశ్​రెడ్డి నయా పైసా  తీసుకురాలేదని, కల్యాణలక్ష్మి చెక్కులు  పంచేందుకే ఆయన మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.  తెలంగాణ తలరాతను మార్చడానికి, ప్రజల భవిష్యత్ కోసమే తాను రాజీనామా చేసినట్టు చెప్పారు.