ఏ పథకం తెచ్చినా టీఆర్ఎస్ కు మిగిలేది ఓటమే

ఏ పథకం తెచ్చినా టీఆర్ఎస్ కు మిగిలేది ఓటమే
  • మునుగోడు ఉప ఎన్నిక వల్లే గిరిజన బంధు
  • ఏ పథకం తెచ్చినా టీఆర్ఎస్ కు మిగిలేది ఓటమే: రాజగోపాల్ రెడ్డి

సంస్థాన్ నారాయణపురం, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికప్పుడు దళిత బంధు పథకం తెచ్చిన సీఎం కేసీఆర్.. ఇపుడు మునుగోడు ఉప ఎన్నిక రానున్నందుకే గిరిజన బంధు పథకం తెస్తున్నారని బీజేపీ నేత, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో జనగాం రాచకొండ,శేరిగూడెం, పుట్టపాక  గ్రామాలకు చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు రాజగోపాల్ సమక్షంలో బీజేపీలో చేరారు. మునుగోడులో ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా టీఆర్ఎస్ మాత్రం గెలవబోదని ఆయన అన్నారు.

ప్రజలు ఇచ్చే తీర్పు తన కోసం కాదని, మునుగోడు.. తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. మునుగోడు ధర్మయుద్ధంలో ప్రజలంతా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. 1400 మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకుంటే రాష్ట్రం వచ్చిందని, ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం మాత్రమే పాలన సాగిస్తోందని విమర్శించారు. ఆయన కుటుంబం ప్రాజెక్ట్ ల పేరుతో వేల కోట్లు దోపిడీ చేసిందన్నారు. తెలంగాణలో నియంత పాలన సాగిస్తున్న సీఎంను గద్దె దింపాలంటే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షాతోనే సాధ్యమని అన్నారు. అందుకే తాను బీజేపీలో చేరానని చెప్పారు. ఇంతకాలం ఫామ్ హౌస్ లో ఉన్న సీఎం కేసీఆర్​ను .. తన రాజీనామాతోనే మునుగోడుకు రప్పించానని అన్నారు.