సాగర్ డ్యాం దగ్గర హై డ్రామా : కేసీఆర్ సెంటిమెంట్ కుట్ర అంటున్న కోమటిరెడ్డి

సాగర్ డ్యాం దగ్గర హై డ్రామా : కేసీఆర్ సెంటిమెంట్ కుట్ర అంటున్న కోమటిరెడ్డి

నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర అర్థరాత్రి హైడ్రామా నడిచింది. 2023, నవంబర్ 30వ తేదీ తెల్లవారుజామున ఏపీ పోలీసులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఏపీకి నీళ్లు విడుదల చేయాలని.. గేటు నెంబర్ 13 ఓపెన్ చేయటానికి ప్రయత్నించారు. ఏపీలో మంచినీటి అవసరాల కోసం.. ఏపీ వాటా నీటిని విడుదల చేసుకుంటామంటూ ప్రాజెక్టు దగ్గర వందలాది మంది పోలీసులు వచ్చారు. విషయం తెలిసిన తెలంగాణ పోలీసులు.. పెద్ద సంఖ్య అక్కడికి చేరుకున్నారు. పల్నాడు జిల్లా నుంచి ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు కూడా రావటంతో ఉద్రిక్తత నెలకొంది. 

ఓ సమయంలో ఏపీ పోలీసులు.. తెలంగాణ వైపు ఉన్న బారికేడ్లను సైతం దూకి మరీ డ్యాం వైపు రావటానికి ప్రయత్నించటంతో.. వాళ్లను అడ్డుకున్నారు తెలంగాణ పోలీసులు. నీటిని విడుదల చేయటానికి అనుమతి లేదని.. పోలీసులు ఎలా వస్తారంటూ తెలంగాణ పోలీసులు వాగ్వాదానికి దిగారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజునే ఈ ఘటన జరగటం చర్చనీయాంశం అయ్యింది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు దగ్గర పరిస్థితిపై నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. సాగర్ డ్యాం దగ్గర హైడ్రామా బీఆర్ఎస్ పార్టీ.. కేసీఆర్ పన్నాగం అని.. పోలింగ్ రోజు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సెంటిమెంట్ రగిలించేందుకు చేసిన ఎత్తుగడ అన్నారాయన. ఇన్ని రోజులు లేనిది.. పోలింగ్ రోజు మాత్రమే గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తెలంగాణ, ఏపీ ప్రజలు ఎవరూ ఈ విషయాన్ని నమ్మొద్దని.. ఇదంతా ఓట్ల కోసం ఆడుతున్న డ్రామా అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 

కేసీఆర్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, డ్రామాలు ఆడినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరని.. కాంగ్రెస్ పార్టీ 90 సీట్లలో గెలుపు ఖాయం అని జోస్యం చెప్పారు.