మార్మోగిన మల్లన్న నామస్మరణ

మార్మోగిన మల్లన్న నామస్మరణ
  •     పదకొండో ఆదివారానికి భారీగా తరలివచ్చిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి పుణ్యక్షేత్రం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. మల్లికార్జున స్వామి  బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11వ ఆదివారానికి  మెదక్, హైదరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట కరీంనగర్, జగిత్యాల జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.  కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు ఒడిబియ్యం పోసి, తలవెంట్రుకలు సమర్పించి, గంగిరేగు చెట్టువద్ద పట్నాలు వేసి ముడుపులు కట్టారు.

మహిళా భక్తులు మల్లన్నతో పాటు కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.  స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పట్టింది. కాగా, తంగళ్లపల్లికి చెందిన గడ్డం వెంకటయ్య అన్నదానం కోసం రూ. 50,116 విరాళంగా అందించారు. సిద్దిపేట జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరికొండల్ రెడ్డి స్వామిని దర్శించుకొని కిలో వెండి బిండెను సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో బాలాజీ, చైర్మన్ లక్ష్మారెడ్డి, ఆలయ ఏఈవోలు గంగా శ్రీనివాస్, బద్ది శ్రీనివాస్ ఏర్పాట్లను  పర్యవేక్షించారు.