Geethanjali Malli Vachindi: తనకి ఇది 50వ సినిమా..త్వరలో రూ.50 కోట్ల సెలబ్రేషన్స్‌లో కలుస్తాం: కోన వెంకట్

Geethanjali Malli Vachindi: తనకి ఇది 50వ సినిమా..త్వరలో రూ.50 కోట్ల సెలబ్రేషన్స్‌లో కలుస్తాం: కోన వెంకట్

సౌత్ బ్యూటీ అంజలి(Anjali) ప్రధాన పాత్రలో వచ్చిన గీతాంజలి(Geethanjali) మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హారర్ అండ్ కామెడీ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు.. భయపెట్టింది కూడా. అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindi) పేరుతో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు ప్రముఖ రచయిత కోన వెంకట్.

ఈ సినిమాలో కూడా అంజలి, శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy), షకలక శంకర్(Shakalaka Shankar), సునీల్(Sunil) తదితరులు కీ రోల్స్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది. దెయ్యాలతో సినిమా షూటింగ్‌ అనేది కొత్త పాయింటే. ఆ ఎపిసోడ్‌ వరకు కామెడీ బాగా వర్కౌట్‌ అయింది. కానీ మిగతా కథంతా అంతగా ఆకట్టుకునేలా సాగదు. అయితే, ఈ సినిమా హారర్ జానర్ లో రావడం ఆడియన్స్ లో స్పెషల్ ఇంపాక్ట్ కలిగేలా చేస్తోంది. దీంతో ఈ సినిమాకి వస్తోన్న స్పందనతో  సక్సెస్ మీట్‌ తిరుపతిలో జరిగింది. ఈసందర్భంగా మీడియాతో నిర్మాత కోన వెంకట్‌ మాట్లాడుతూ.. 

‘‘గీతాంజలి ఫస్ట్ పార్ట్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అప్పట్లో అది ట్రెండ్‌ సెట్‌ చేసింది. ఇక ఇప్పుడు వచ్చిన సెకండ్ పార్ట్ దానికి మించిన విజయం సొంతం చేసుకుంది. నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్లలో ఎన్నో హిట్స్‌.. ఫ్లాప్స్‌ చూశా. విజయం అనేది ఎంత ముఖ్యమో ఈ సినిమాతో ఫస్ట్ టైం తెలిసొచ్చింది. సక్సెస్‌ మనకు బలాన్నిస్తుంది.అది ఇండస్ట్రీకి వచ్చే కొత్త దర్శకులకు ఎంతోగాను ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా నిర్మాతలకు రెట్టింపు ఉత్సాహాన్నిస్తుంది. కొత్త స్టోరీలను ప్రేక్షకులకు చెప్పడానికి శక్తినిస్తుంది. ఈ సినిమా అంజలికి ఎంతో ప్రత్యేకం. తనకి ఇది 50వ సినిమా. అందుకే రూ.50కోట్లు వసూలు చేయాలని దేవుడిని కోరుకున్నా. ఇప్పటికే థియేటర్లలో ఎక్కడ చూసిన హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో పెద్ద నంబర్లనే చూస్తాం. దేవుడి దయతో రూ.50 కోట్లు వస్తాయన్న నమ్మకముంది. ఈ సినిమా కోసం ఎంతోమంది కష్టపడ్డారు. త్వరలోనే మీ అందరినీ రూ.50 కోట్ల సెలబ్రేషన్స్‌లో కలుస్తాం’ నిర్మాత కోన వెంకట్ వెల్లడించారు. మరి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.