హనుమాన్​ జయంతికి  కొండగట్టు ముస్తాబు.

హనుమాన్​ జయంతికి  కొండగట్టు ముస్తాబు.
  • నేటి నుంచి  మూడు రోజుల పాటు ఉత్సవాలు
  • సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
  • అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసిన ఆఫీసర్లు

కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న పెద్ద జయంతి వేడుకలకు ఆలయం ముస్తాబైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌‌గఢ్‌‌, ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి సుమారు మూడు లక్షల మంది హనుమాన్‌‌ దీక్షాదారులు, భక్తులు రానున్నారని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

యాగశాల శుద్ధితో ఉత్సవాలు ప్రారంభం

హనుమంతుడు జన్మించిన పూర్వాభాద్ర నక్షత్రం ప్రకారం ప్రతి సంవత్సరం కొండగట్టులో జయంతి వేడుకలు నిర్వహిస్తుంటారు. మంగళవారం ఉదయం యాగశాల శుద్ధి చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. భద్రాచలం శ్రీరాముడి ఆలయం నుంచి కొండగట్టుకు పట్టువస్త్రాలు తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజున అఖండ దీపారాధన, రక్షాబంధనము, రుత్విక్‌‌వరణం, దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

రెండో రోజైన బుధవారం హోమం, నవగ్రహ ఆరాధన, సుందరకాండ పారాయణం, ప్రత్యేక అభిషేకాలు, సహస్రనామార్చన, మహా నివేదన, మంత్రపుష్పం నిర్వహించనున్నారు. చివరి రోజైన గురువారం తిరుమంజనం, ద్రవిడ ప్రబంధ పారాయణం, శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన, తులసి అర్చన హోమం నిర్వహిస్తారు. ఈ రోజుతో ఉత్సవాలు ముగియనున్నాయి.

రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు

మూడు రోజుల పాటు జరిగే జయంతి హనుమాన్‌‌ పెద్ద జయంతి ఉత్సవాలకు సుమారుగా మూడు లక్షల మంది భక్తులు హాజరుకానున్నట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చలువ పందిళ్లు వేయడంతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ సమీపంలోని వై జంక్షన్‌‌ నుంచి తొలిసారిగా సీలింగ్‌‌ టెంట్లు వేశారు. గుట్టపైన కోనేరులోకి, ఇతర అవసరాలకు 50 లక్షల లీటర్ల నీటిని అందుబాటులో ఉంచేలా మిషన్‌‌ భగీరథ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు.

కొండగట్టుపైకి వచ్చే భక్తుల కోసం మూడు రోజుల పాటు ఉచితంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. భక్తులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా 30 చలివేంద్రాలు, అత్యవసర చికిత్స అందించేందుకు 24 గంటలు నడిచేలా మెడికల్‌‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. పంచాయతీ, రెవెన్యూ, హెల్త్, మిషన్‌‌భగీరథ, ఆర్టీసీ, ఫైర్, పోలీస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌‌మెంట్ల ఆఫీసర్లు మూడు రోజుల పాటు గుట్టపైనే అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 900 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో పాటు 110 సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. 

ఆర్జిత సేవలు రద్దు 

కొండగట్టు ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే ఆర్జిత, వాహన పూజలను హనుమాన్‌‌ పెద్ద జయంతి సందర్భంగా రద్దు చేస్తున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. మంగళవారం నుంచి గురువారం వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవన్నారు. మూడు రోజుల పాటు 24 గంటలూ ఆలయాన్ని తెరిచే ఉంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పారు.

సిద్ధంగా 4.5 లక్షల లడ్డూలు

హనుమాన్‌‌ పెద్ద జయంతి వేడుకలు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా వేసిన ఆఫీసర్లు అందుకు తగ్గట్లుగా ప్రసాదాలు తయారు చేస్తున్నారు. కొండగట్టుకు వచ్చే భక్తులకు అందించేందుకు ఇప్పటికే 4.5 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా సీతారాముల చరిత్ర, ఆంజనేయుడి చరిత్ర, సుందరకాండ వంటి అంశాలను నాటక రూపంలో ప్రదర్శించనున్నారు.