కేసీఆర్..పాపాల భైరవుడు : కూనంనేని సాంబశివరావు

కేసీఆర్..పాపాల భైరవుడు : కూనంనేని సాంబశివరావు
  • కరువు పరిస్థితులకు, కృష్ణాబేసిన్ ఎండిపోవడానికి ఆయనే కారణం 
  • బీఆర్​ఎస్ పాలనలో రూ. 6 వేల కోట్ల పంట నష్టం జరిగితే ఎంతిచ్చారు?
  • మా ఎమ్మెల్యేను లాక్కున్న పాపం ఇప్పుడు తగిలింది
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఫైర్​ 

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో కరువు పరిస్థితులకు, కృష్ణా బేసిన్​ ఎండిపోవడానికి కారణం కేసీఆర్​ అని, పాపాల భైరవుడు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫైర్​ అయ్యారు. ‘‘గతంలో కేసీఆర్ చేసిన తప్పులతోనే తెలంగాణ ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట నష్టానికి రూ.25 వేలు డిమాండ్‌‌ చేస్తున్న కేసీఆర్.. ఆయన ప్రభుత్వ హయాంలో ఎంత నష్ట పరిహారం చెల్లించారో చెప్పాలి?” అని డిమాండ్​ చేశారు.

కేసీఆర్ పాలనలో 2014 నుంచి 2018 వరకు పూర్తిస్థాయి కరువు ఉన్నదని, ఈ కాలంలో రూ. 5 వేల కోట్ల నుంచి 6 వేల కోట్ల వరకు పంట నష్టం జరిగిందని తెలిపారు.  2017లో వరదలతో 12 లక్షల ఎకరాల ఖరీఫ్‌‌ పంట, 5 లక్షల ఎకరాల రబీ పంటకు నష్టం జరిగిందని వివరించారు. 2023లో 12 లక్షల ఎకరాల ఖరీఫ్‌‌ పంట, 5 లక్షల ఎకరాల రబీ పంట దెబ్బతిందని చెప్పారు.

సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి తదితరులతో కలిసి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రాష్ట్ర వాటా కింద మ్యాచింగ్‌‌ ఫండ్స్‌‌ను చెల్లించకపోవడంతో కేంద్ర కేటాయింపులను కూడా గత బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ఉపయోగించలేదని మండిపడ్డారు. ఉన్న నీటిని లెక్కవేసి, వాటిని వ్యవసాయ రంగాలకు షిఫ్ట్‌‌ పద్ధతిలో పంపిణీ చేసేలా ‘తై బందీ’ విధానాన్ని నాడు కేసీఆర్‌‌ మర్చిపోయారని ఆయన అన్నారు.  ప్రస్తుతం 10 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని, ముందుగా ప్రతి ఎకరాకూ రూ.10 వేల చొప్పున వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. 

ఫిరాయింపులపై కేసీఆర్​ తీరు విడ్డూరం

జాతీయ పార్టీల్లో తెలంగాణ రాష్ట్రం కావాలని ముందుగా అడిగింది సీపీఐ మాత్రమేనని కూనంనేని సాంబశివరావు తెలిపారు. అలాంటి తమ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా అప్పట్లో కేసీఆర్ లాక్కున్నారని, ఆ పాపమే ఆయనకు తగిలిందని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఇప్పుడు కేసీఆర్  మాట్లాడుతున్న తీరు  విడ్డూరంగా ఉందని విమర్శించారు.

‘‘ఫిరాయింపులపై ఇప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. పాపాల ఊబిలో పడిన కేసీఆర్​ను పైకి లేపేందుకు ఎవ్వరూ లేరు. డబ్బు, సెంటిమెంట్‌‌ ఇప్పుడు బీఆర్​ఎస్​కు పనిచేయడం లేదు. బీఆర్​ఎస్​ పార్టీకి కార్యకర్తలు కూడా లేరు” అని అన్నారు.  తాము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని, పార్టీ మారగానే వెంటనే పదవికి రాజీనామా చేయాలనే చట్టం ఉండాలని ఆయన డిమాండ్‌‌ చేశారు.