తెగిపోయిన హై వోల్టేజ్ వైర్లు.. ఆగిపోయిన రైళ్లు

తెగిపోయిన హై వోల్టేజ్ వైర్లు..  ఆగిపోయిన  రైళ్లు

దేశంలో రైలు ప్రమాద ఘటనలు ఈ మధ్య తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. ఒడిశా రైలు ప్రమాద ఘటన మరువకముందే  మరికొన్ని ప్రమాదాలు వెలుగుచూస్తున్నాయి.  తాజాగా మంచిర్యా ల జిల్లాలో పెద్ద రైలు ప్రమాదం తప్పింది. 

2023 జూన్ 11 ఆదివారం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో ఓవర్‌హెడ్‌ ఎలక్ట్రిక్‌ తీగ తెగినట్టు రైల్వే సిబ్బంది గుర్తించారు. మహబూబ్‌నగర్‌కు వెళ్లే రైలు మందమర్రికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా రైలు ఇంజిన్‌కు విద్యుత్‌ తీగలు తగలడంతో తెగిపడ్డాయి. ఈ విషయాన్ని వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. 

వెంటనే అధికారులు అలెర్ట్ అయి  కాజీపేట వైపునకు వెళ్తున్న కుచువెల్లి-కోర్బా ఎక్స్‌ప్రెస్‌ రైలును 3.10గంటలకు బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఢిల్లీ వెళ్తున్న రాజధాని రైలు 45 నిమిషాల పాటు నిలిచిపోయింది. అనంతరం మరమ్మత్తులు పనులను అధికారులు సాయంత్రం 5 గంటలకు పూర్తి చేశారు. కోర్బా ఎక్స్‌ప్రెస్‌ రైలు సాయంత్రం 6గంటలకు యధావిధిగా బయలుదేరగా, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో దాదాపు రెండున్నర గంటల పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 

మరో వైపు కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ కోసం వచ్చిన ప్రయాణికులు నాలుగు గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. దానాపూర్‌, అండమాన్‌, ఏపీసీపీ, కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సాయంత్రం 6గంటల సమయంలో అన్ని రైళ్లు పట్టాలెక్కాయని రైల్వే అధికారులు తెలిపారు.