
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆదివారం ( జులై 13 ) తెల్లవారుజామున హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు కోట శ్రీనివాసరావు. కోట మృతితో టాలీవుడ్ దిగ్బ్రాంతికి గురయ్యింది. సినీ, రాజకీయ ప్రముఖులు కోట మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా కూడా ప్రాణం ఖరీదు కావడం గమనార్హం. ప్రాణం ఖరీదు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కోట ఆ తర్వాత విలన్ గా, కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. తనదైన శైలిలో నటిస్తూ విలక్షణ నటుడిగా ఎదిగారు కోట.
ప్రాణం ఖరీదు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత 1986లో వచ్చిన ప్రతి ఘటన సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కోట. అహ నా పెళ్ళంట సినిమాలో పిసినారి పాత్ర ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత కోట నటనకు తిరుగులేని విధంగా ఎదిగారు. 750కి పైగా సినిమాల్లో నటించిన కోట.. హావభావాలు, డైలాగ్ డెలివరీలో తన ప్రత్యేకత చాటుకున్నారు. విలన్, కామెడీ విలన్, పోలీసు, మాంత్రికుడు ఇలా విభిన్న పాత్రల్లో జీవించారు కోట.
1942లో ఏపీలోని కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావు చిన్నతనం నుంచే నాటకాలపై మక్కువ చూపించేవారు. చదువు పూర్తి చేసుకొని స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తుండగానే నటనా నైపుణ్యాన్ని పెంచుకున్నారు కోట. 1968లో రుక్మిణి దేవితో వివాహమైన ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు జన్మించారు. కోట కొడుకు ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కొడుకు మరణం కోట జీవితంలో తీవ్ర విషాదం నింపింది.