పోలీస్ జాగిలం షైనీకి అంత్యక్రియలు

పోలీస్ జాగిలం షైనీకి అంత్యక్రియలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు :  అనారోగ్యంతో మృతిచెందిన పోలీస్ జాగిలం షైనీకి పోలీస్ అధికారులు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. కొత్తగూడెంలోని ఓఎస్డీ ఆఫీసులో పోలీస్ డాగ్ స్క్వాడ్ కు చెందిన షైనీ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ మృతి చెందింది. షైనీకి అడిషనల్ ఎస్పీ  పంకజ్ పరితోష్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేళ్లపాటు షైనీ పోలీస్ డిపార్ట్​మెంట్ కు చేసిన సేవలు మరువలేనివన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ల్యాండ్ మైన్స్​ను గుర్తించడంలో షైనీ కీలక భూమిక పోషించిందని గుర్తుచేశారు. దాదాపు 30 ల్యాండ్ మైన్స్ ను గుర్తించిందని తెలిపారు. వీఐపీల పర్యటనలో బందోబస్తు లో భాగంగా షైనీ క్రియాశీలకంగా వ్యవహరించిందని చెప్పారు.

పోలీస్ హెడ్ క్వార్టర్ లో షైనీకి అంత్యక్రియలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, వన్​టౌన్ సీఐ కరుణాకర్, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.