పాలమూరు రాజకీయాలపై..‘కొత్తకోట’ చెరగని ముద్ర

పాలమూరు రాజకీయాలపై..‘కొత్తకోట’ చెరగని ముద్ర

మహబూబ్​నగర్​/మక్తల్, వెలుగు : కొత్తకోట దయాకర్​రెడ్డి పబ్లిక్​ లీడర్​గా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తనదైన ముద్ర వేశారు. రాజకీయంగా ఎదిగేందుకు లీడర్లు తరచూ పార్టీలు మారుస్తూ పదవులు పొందినా, ఆయన మాత్రం ఒకే పార్టీలో కొనసాగుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. చివరకు తప్పసరి పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా, ఏ పార్టీ వైపు మొగ్గు చూపలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన కొద్ది రోజులకే అనారోగ్యంతో మృతి చెందారు.

టీపీడీ నుంచి రాజకీయ ప్రస్థానం..3

దయాకర్​రెడ్డిది పాలమూరు జిల్లా చిన్నచింతకుంట మండలంలోని పర్కాపూర్​ స్వగ్రామం. ఆయనకు భార్య సీతమ్మతో పాటు సిద్ధార్థ, కార్తీక్​ కుమారులు ఉన్నారు. దయాకర్​రెడ్డి విద్యార్థి దశ నుంచే టీఎన్​టీయూసీ లీడర్​గా పని చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్​ను అభిమానించేవారు. ఆ అభిమానంతోనే 1987లో టీడీపీలో చేరారు. చివరి దాకా ఆ పార్టీలోనే కొనసాగారు. అయితే, రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ బలహీన పడడంతో 2014, 2018 ఎన్నికల్లో మక్తల్​ సెగ్మెంట్​నుంచి టీడీపీ గుర్తుతో పోటీ చేసినా దయాకర్​రెడ్డి ఓడిపోయారు. దీంతో పార్టీ మారాలని 2019 నుంచి ఆయన అనుచరులు ఒత్తిడి తెచ్చారు. చివరకు గతేడాది అభిమానుల అభిప్రాయాన్ని మన్నించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపారు. ఆయన బర్త్​డే సందర్భంగా నిరుడు ఆగస్టు 18న టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, కంట నీరు పెట్టుకున్నారు. 

అయితే, రానున్న ఎన్నికల్లో మక్తల్  అసెంబ్లీ నుంచి పోటీ చేయడం ఖాయమని, అది ఏ పార్టీ నుంచి అనేది సమయం వచ్చినప్పుడు చెబుతానని ప్రకటించారు. కానీ, కొద్ది రోజులకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వెన్నెముక కేన్సర్​తో రెండు నెలలుగా హైదరాబాద్​లోని ఏఐజీ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో దయాకర్​రెడ్డి తుది శ్వాస విడిచారు.

మూడు సార్లు ఎమ్మెల్యేగా..

1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దయాకర్​రెడ్డి మొదటి సారిగా అమరచింత (ప్రస్తుత దేవరకద్ర) నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు. తన సమీప అభ్యర్థి కె.వీరారెడ్డి చేతిలో 6,751 ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి 1994, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా కె.వీరారెడ్డిపై రెండు సార్లు పోటీ చేసి విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సల్గూటి స్వర్ణాసుధాకర్​రెడ్డిపై పోటీ చేయగా, 13,783 ఓట్లతో ఓడిపోయారు. 2009లో మక్తల్​ అసెంబ్లీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్​ అభ్యర్థి చిట్టెం రాంమోహన్​రెడ్డిపై గెలుపొందారు. 

2009లో భార్యాభర్తలిద్దరూ..

1999 ఎన్నికల్లో అమరచింత ఎమ్మెల్యేగా గెలిచిన దయాకర్​రెడ్డి ఆయన భార్య సీతమ్మను రాజకీయాల్లోకి అహ్వానించారు. 2002లో దేవరకద్ర జడ్పీటీసీగా సీతమ్మ పోటీ చేసి గెలుపొందారు. అదే ఏడాది ఆమె ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా జడ్పీ చైర్​పర్సన్​గా పనిచేశారు. ఆమెనే మొదటి మహిళా జడ్పీ చైర్​పర్సన్​ కావడం విశేషం. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మక్తల్​నుంచి దయాకర్​రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గం నుంచి సీతమ్మ పోటీ చేసి గెలుపొందారు. ఒకేసారి భార్యాభర్తలిద్దరూ గెలిచి అసెంబ్లీకి వెళ్లి రికార్డ్​ సృష్టించారు.