
కొవిడ్ కేసులు తగ్గుతుండడంతో వాయిదా పడ్డ సినిమాలన్నీ ఒక్కొక్కటిగా థియేటర్స్‌కు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అడివి శేష్ మూవీ ‘మేజర్’ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. మే 27న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు నిన్న ప్రకటించారు. ముంబై టెర్రరిస్ట్ అటాక్‌లో ప్రాణాలర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. నిజానికి ఫిబ్రవరి 11న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్యాండమిక్ వల్ల వాయిదా వేశారు. పెద్ద సినిమాలన్నీ మార్చ్, ఏప్రిల్ నెలల్లో వస్తుండడంతో ‘మేజర్’ రిలీజ్‌కి మే నెలయితేనే కరెక్టని ఈ డేట్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ‘దిస్ సమ్మర్ విల్ బి మాసివ్’ అంటూ ట్వీట్ చేశాడు శేష్. అతనికి జంటగా సయీ మంజ్రేకర్ నటిస్తోంది. శోభితా ధూళిపాళ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళీశర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. మహేష్ బాబుతో కలిసి సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.