బనకచర్లపై కృష్ణా బోర్డు అభ్యంతరాలు.. లింక్ ప్రాజెక్ట్ చేపడితే.. పోలవరానికి మళ్లీ అనుమతులు తీసుకోవాల్సిందే

బనకచర్లపై కృష్ణా బోర్డు అభ్యంతరాలు.. లింక్ ప్రాజెక్ట్ చేపడితే.. పోలవరానికి మళ్లీ అనుమతులు తీసుకోవాల్సిందే
  • సీడబ్ల్యూసీకి వివరణ తెలుపుతూ కృష్ణా బోర్డు లేఖ
  • పోలవరానికి ఇచ్చిన అనుమతులకు.. బనకచర్ల ప్రాజెక్టుకూ పొంతనే ఉండదు
  • గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్తే అన్ని రాష్ట్రాలకూ వాటా ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ
  • ఇప్పటికే సీడబ్ల్యూసీ, పీపీఏ, గోదావరి బోర్డు, పర్యావరణ శాఖల అభ్యంతరాలు

హైదరాబాద్, వెలుగు: ఏపీ చేపడుతున్న పోలవరం బనకచర్ల లింక్​ ప్రాజెక్టుకు కృష్ణా బోర్డు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్​ అథారిటీ (పీపీఏ), గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ, కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరాలు తెలపగా.. తాజాగా బోర్డు కూడా అదే సమాధానం చెప్పింది. బనకచర్ల లింక్​ చేపడితే పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ టెక్నికల్​అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతులు తీసుకోవాల్సిందేనని కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్​ఎంబీ) తేల్చి చెప్పింది. 

బనకచర్ల లింక్​ను చేపడితే పోలవరం ప్రాజెక్ట్​ డైనమిక్స్​ అన్నీ మారిపోతాయని స్పష్టం చేసిన బోర్డు.. బనకచర్ల లింక్​ను చేపడితే అన్ని రాష్ట్రాల అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొంది. బనకచర్ల లింక్‌‌ చేపడితే పోలవరం ప్రాజెక్టు  నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులకు, ప్రస్తుతం ప్రతిపాదించిన పనులకు ఏమాత్రం పొంతన ఉండబోదని వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ)కి బోర్డు తాజాగా రిప్లై ఇచ్చింది. 

పోలవరం బనకచర్ల లింక్​ ప్రాజెక్ట్​పై అభిప్రాయాలు తెలపాలని సూచిస్తే ప్రాజెక్ట్​ పీఎఫ్​ఆర్​ను బోర్డుకు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బోర్డు స్పందించింది. పోలవరం ప్రాజెక్టుకు తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా డిజైన్లు మారుతాయని, కాలువల సామర్థ్యం కూడా పెరుగుతున్నదని పేర్కొంది. బనకచర్ల లింక్​కు సోర్స్​ పోలవరం ప్రాజెక్టే కాబట్టి.. మరోసారి ఆ ప్రాజెక్టుకు టీఏసీ క్లియరెన్స్​ తప్పనిసరి అని స్పష్టం చేసింది. 

 ఆ 45 టీఎంసీల లెక్కే తేలలే

గోదావరి జలాలను కృష్ణా రివర్‌‌కు మళ్లిస్తే, ఆ మళ్లించే జలాల్లో కృష్ణా బేసిన్‌‌లోని రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని బచావత్‌‌ ట్రిబ్యునల్‌‌ అవార్డు చెబుతున్నదని కృష్ణా బోర్డ్ గుర్తు చేసింది. గతంలో పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించగా.. అందులో 45 టీఎంసీలను ఉమ్మడి ఏపీకి, మిగతా 35 టీఎంసీల్లో 21 టీఎంసీలను కర్నాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు కేటాయించిందని పేర్కొంది.

 ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీల వినియోగంపై ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతున్నదని, అదే ఇప్పటికీ తేలలేదని సీడబ్ల్యూసీకి బోర్డు తెలిపింది. ఈ నేపథ్యంలోనే అదే పోలవరం నుంచి ఇప్పుడు కృష్ణా మీదుగా పెన్నా బేసిన్​కు 200 టీఎంసీలను ఏపీ మళ్లించేందుకు బనకచర్ల లింక్​ను చేపడుతున్నదని సీడబ్ల్యూసీకి వివరించింది. కాబట్టి, ఆ మళ్లించే నీళ్లలోనూ ట్రిబ్యునల్​ అవార్డు ప్రకారం మిగతా రాష్ట్రాలకూ వాటా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

 కానీ, బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనల్లో ఏపీ ఆ వాటాల సంగతిని ప్రస్తావించలేదని వివరించింది. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాక ముందుకు పోవాల్సి ఉంటుందని పేర్కొంది.

అయినా ఏపీ మొండి వాదనే..

బనకచర్ల ప్రాజెక్టుపై అన్ని కేంద్ర సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ఏపీ మాత్రం అదే మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నది. తాను చెప్పిందే వేదం అన్నట్టుగా అక్కడి పాలకులు స్టేట్​మెంట్లు ఇస్తున్నారు. మిగులు జలాలు లేవని, వరద జలాలా.. మిగులు జలాలా అన్న అంశంపై పొరుగు రాష్ట్రం క్లారిటీ ఇవ్వడం లేదని ఇప్పటికే సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డు, పీపీఏ, కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. టర్మ్స్​ ఆఫ్​  రిఫరెన్స్​ను ఆమోదించాలంటూ పీఎఫ్​ఆర్​ను పంపినా.. పర్యావరణ శాఖ దానిని తిప్పి పంపించింది. 

బనకచర్ల లింక్​ ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్ట్​ కాంపోనెంట్​ మొత్తం మారిపోతుందని పీపీఏ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు వాటికి తోడుగా కృష్ణా బోర్డు కూడా బనకచర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. అయితే, రెండు రోజుల క్రితం ఏపీ మంత్రి నారా లోకేశ్​ మాత్రం.. బనకచర్లను కట్టి తీరుతామని, అనుమతులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. వృథాగా సముద్రంలో కలిసే జలాలనే మళ్లించుకుంటామని మొండి వాదనకు దిగారు. వాస్తవానికి ఆ నీళ్లపైనా అన్ని రాష్ట్రాల వాటా తేలకుండానే నీటిని తరలించుకుంటామనడంపై ఇప్పటికే కేంద్ర సంస్థలు అభ్యంతరం తెలిపాయి.