బనకచర్లపై కృష్ణా బోర్డు స్పందిస్తలే.. కేంద్రం ఆదేశించినా పట్టించుకోని KRMB..!

 బనకచర్లపై కృష్ణా బోర్డు స్పందిస్తలే.. కేంద్రం ఆదేశించినా పట్టించుకోని KRMB..!
  • అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం ఆదేశించినా పట్టించుకోని బోర్డు
  • ప్రాజెక్టు అసాధ్యమని ఇప్పటికే కేంద్రానికి రిపోర్టు ఇచ్చిన జీఆర్‌‌‌‌ఎంబీ, పీపీఏ
  • కృష్ణా జలాలకు ఏపీ ఎసరు పెడుతుందన్న ఆరోపణలు ఉన్నా స్పందించని కేఆర్‌‌‌‌ఎంబీ 

హైదరాబాద్, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టుపై కృష్ణా రివర్ మేనేజ్‌‌మెంట్ బోర్డు (కేఆర్‌‌‌‌ఎంబీ) స్పందించడం లేదు. ఇప్పటికే గోదావరి రివర్ మేనేజ్‌‌మెంట్ బోర్డు (జీఆర్‌‌‌‌ఎంబీ), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)లు.. పోలవరం, బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్రానికి లేఖలు రాశాయి. ఇటు సెంట్రల్ వాటర్ కమిషన్​(సీడబ్ల్యూసీ), నేషనల్ వాటర్ డెవలప్‌‌మెంట్​ఏజెన్సీ (ఎన్‌‌డబ్ల్యూడీఏ) కూడా అక్కడ జలాల లభ్యత లేదని స్పష్టం చేస్తూ కేంద్రానికి రిపోర్టు కూడా ఇచ్చాయి. 

ప్రాజెక్టుపై ఏపీ సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్‌‌ఆర్)పై కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలోని ఎక్స్‌‌పర్ట్స్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) కూడా అభ్యంతరాలు తెలిపింది. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)కు ఆమోదం తెలపలేదు. ముందుగా సీడబ్ల్యూసీ అనుమతులు తీసుకోవాలని ఏపీకి స్పష్టం చేస్తూ పీఎఫ్‌‌ఆర్‌‌‌‌ను తిప్పిపంపింది. ఇటు ప్రాజెక్టుపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా జీఆర్‌‌‌‌ఎంబీ, పీపీఏతో పాటు కేఆర్‌‌‌‌ఎంబీకీ సూచించింది. కేంద్రం సూచనలతో జీఆర్‌‌‌‌ఎంబీ, పీపీఏలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. కానీ, కృష్ణా బోర్డు మాత్రం ఇప్పటికీ బనకచర్లపై స్పందించలేదు. 

కృష్ణా దోపిడీకే అని ఆరోపణలున్నా..

పోలవరం నుంచి గోదావరిలోని మిగులు జలాలను తీసుకెళ్తామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా.. దాని వెనుక కృష్ణా జలాల దోపిడీకి కుట్ర జరుగుతున్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీ నుంచీ నీళ్లను దొడ్డిదారిలో రాయలసీమకు దోచుకెళ్లేలా ఏపీ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను ఏర్పాటు చేసి పెట్టుకున్నది. పోతిరెడ్డిపాడు ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాంతాలకు నీళ్లను తరలిస్తున్నది. రోజూ 9 టీఎంసీల వరకు నీటిని దోచుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.

 ఇప్పుడు పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా నది ద్వారానే బనకచర్లకు నీటిని తరలించే స్కీమ్‌‌ను ఏపీ మొదలుపెడుతున్నది. ఇటు ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసి అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడి కాల్వ 80వ కిలోమీటర్ పాయింట్ వద్ద ఆక్విడక్ట్‌‌ను నిర్మించాలని తలపెట్టింది. ఇక్కడే కృష్ణా నీళ్లకు ఏపీ ఎసరు పెట్టే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 దీనిపైనే ఇప్పటికే ప్రభుత్వం కూడా అభ్యంతరాలను లేవనెత్తింది. కానీ, కృష్ణా బోర్డు ఇప్పటిదాకా ఈ అంశంపై స్పందించడం లేదు. బనకచర్ల ప్రాజెక్టుతో కృష్ణా నదిలో ఎలాంటి నష్టం జరుగుతుంది.. ఎంత నష్టం జరుగుతుందన్న విషయంపై తన అభిప్రాయాలను వెల్లడించలేదు. కేంద్రం అడిగినా కూడా ఏపీ ప్రాజెక్టుపై కృష్ణా బోర్డు తన అభిప్రాయాలు తెలపకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, దీనిపై త్వరలోనే కేంద్రానికి రిపోర్టు ఇస్తామని చెబుతున్నా.. ఎప్పుడు ఇస్తారన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు, కృష్ణా నదిలో తన కోటాకు మించి నీళ్లను వాడుకున్నా.. ఏపీ ఇండెంట్ పెట్టిన వెంటనే మళ్లీ ఆ రాష్ట్రానికి బోర్డు నీటి కేటాయింపులను చేయడం విమర్శలకు తావిచ్చింది.