ఆర్డీఎస్‌‌ వివాదాలకు ముగింపు పలకాలని కృష్ణా బోర్డు నిర్ణయం

ఆర్డీఎస్‌‌ వివాదాలకు ముగింపు పలకాలని కృష్ణా బోర్డు నిర్ణయం
  • మూడు రాష్ట్రాలు, తుంగభద్ర బోర్డుకు కృష్ణా బోర్డు లేఖ

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్డీఎస్‌‌ చుట్టూ నెలకొన్న వివాదాలకు ముగింపు పలకాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే బోర్డు నేతృత్వంలోని టెక్నికల్‌‌ టీమ్ ఆర్డీఎస్‌‌ ఆనికట్‌‌, సుంకేసుల బరాజ్‌‌, తుమ్మిళ్ల లిఫ్ట్‌‌ స్కీమ్ తో పాటు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆర్డీఎస్‌‌ కుడి కాలువల పనులను పరిశీలించింది. రాజోలి బండ డైవర్షన్‌‌ స్కీమ్​తో ముడిపడి ఉన్న అంశాలపై చర్చించేందుకు ఈ నెల 9న జలసౌధలో కేఆర్‌‌ఎంబీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొనాలని తెలంగాణ, ఏపీ ఇరిగేషన్‌‌ ఈఎన్సీలు, కర్నాటక నీరవరి నిగమా లిమిటెడ్‌‌ ఎండీ, తుంగభద్ర బోర్డు చైర్మన్‌‌లకు కేఆర్‌‌ఎంబీ ఈఈ శివశంకరయ్య ఇటీవల లేఖ రాశారు. జనవరి 28న కేఆర్‌‌ఎంబీ కమిటీ పరిశీలించి బోర్డుకు ఇచ్చిన ఫీల్డ్‌‌ అబ్జర్వేషన్‌‌ వివరాల కాపీలోని అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలియజేశారు. 
తెలంగాణ, ఏపీ ఫిర్యాదులు.. 
ఆర్డీఎస్‌‌లో తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులు ఉండగా, ఇంతవరకు 5 టీఎంసీలకు మించి వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలో సుంకేసుల ఫోర్‌‌షోర్‌‌లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఈ లిఫ్ట్‌‌ స్కీమ్ అక్రమమని ఏపీ కంప్లయింట్లు చేసింది. ఆర్డీఎస్‌‌ నీళ్లు తెలంగాణకే సరిపోవడం లేదని, ఏపీ కేటాయింపులకు రెట్టింపు నీటిని తీసుకుంటూ కొత్తగా కుడి కాలువ తవ్వకానికి పూనుకుందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. కర్నాటక భూభాగంలోని ఆర్డీఎస్‌‌ కాలువ ఆధునీకరణ, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మూడు రాష్ట్రాలు చీఫ్‌‌ ఇంజనీర్‌‌ స్థాయి అధికారిని ఈ సమావేశానికి పంపాలని బోర్డు సూచించింది.