డోంట్ వర్రీ..ఇండియన్ బ్యాంక్‌‌లు గట్టివే!

డోంట్ వర్రీ..ఇండియన్ బ్యాంక్‌‌లు గట్టివే!

న్యూఢిల్లీ : ఆందోళనకరంగా మారిన యెస్ బ్యాంక్‌‌ పరిస్థితి నేపథ్యంలో, మొత్తం బ్యాంకింగ్ రంగ సిస్టమ్‌ చర్చనీయాంశమైంది. అయితే ఇండియన్ బ్యాంక్‌‌లు చాలా బలంగా ఉన్నాయని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ క్రిష్ణమూర్తి సుబ్రమణియన్ స్పష్టం చేశారు. డిపాజిట్, మార్కెట్ క్యాపిటలైజేషన్ రేషియోను పరిగనలోకి తీసుకుని ఒక బ్యాంక్‌‌ హెల్త్‌‌ను లెక్కకట్టడం తప్పుడు విధానమని చెప్పారు. బ్యాంక్‌‌ల సేఫ్టీని అంచనావేయడంలో, మార్కెట్ క్యాప్‌‌ రేషియో అనేది పూర్తిగా తప్పుడు విధానమని స్పష్టం చేశారు. ఏ బ్యాంకింగ్ రంగ నిపుణుడు కానీ, ఏ బ్యాంకింగ్ రెగ్యులేటరీ కానీ ఈ విధానాన్ని పాటించదని పేర్కొన్నారు. క్యాపిటల్, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో(సీఆర్‌‌‌‌ఏఆర్), ఇతర విధానాలు బ్యాంక్‌‌ల హెల్త్‌‌ను అంచనావేయడంలో కరెక్ట్ అయినవని సుబ్రమణియన్ చెప్పారు. బ్యాంకింగ్ నిపుణులు, రెగ్యులేటర్స్ వాడే విధానం సీఆర్‌‌‌‌ఏఆర్ అని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ సీఆర్‌‌‌‌ఏఆర్‌‌‌‌ను బ్యాంక్‌‌లు 8 శాతంగా ఉంచుకోవడం అత్యంత కీలకమని, ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్‌‌లకు  సీఆర్‌‌‌‌ఏఆర్ యావరేజ్‌‌గా 14.3 శాతంగా ఉన్నట్టు వెల్లడించారు. అంటే అంతర్జాతీయ ప్రమాణాల కంటే 80 శాతం ఎక్కువ క్యాపిటల్ ఇండియన్ బ్యాంక్‌‌ల వద్ద ఉన్నట్టని వివరించారు. అయితే ఇండియన్ బ్యాంక్‌‌లు సీఆర్‌‌‌‌ఏఆర్‌‌‌‌ను 9 శాతంగా ఉంచాలని ఆర్‌‌‌‌బీఐ ఆదేశించినట్టు చెప్పారు. అలా చూసినా 60 శాతం కంటే ఎక్కువ క్యాపిటల్ మన బ్యాంక్‌‌ల వద్ద ఉన్నట్టేనని తెలిపారు. మన బ్యాంక్‌‌లు చాలా బలంగా ఉన్నాయని అన్నారు. డిపాజిట్, మార్కెట్ క్యాప్ రేషియో ఎందుకు కరెక్ట్ కాదో వివరిస్తూ.. బ్యాంక్‌‌ల షేరు ధర నిమిష నిమిషానికి మారుతుంటుందని చెప్పారు.  సాల్వెన్సీ(అప్పులు తీర్చడం) మినిట్ టూ మినిట్ మారవని సుబ్రమణియన్​ వివరించారు.

అన్ని బ్యాంక్లనూ చూస్తున్నాం..

యెస్​ బ్యాంక్​ క్రైసిస్​ నేపథ్యంలో అన్ని బ్యాంక్‌లను క్లోజ్‌గా మానిటర్ చేస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌‌బీఐ) తెలిపింది. ఏ బ్యాంక్ డిపాజిట్ల సేఫ్టీ విషయంలోనూ  భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. కొన్ని బ్యాంక్‌లలోని డిపాజిట్ల సేఫ్టీపై వస్తోన్న అనుమానాలను ఆర్‌‌బీఐ కొట్టివేసింది. యెస్ బ్యాంక్‌ నేపథ్యంలో మిగతా కొన్ని బ్యాంక్‌ల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆర్‌‌బీఐ స్పందించింది.