చేతులెత్తేసిన కృష్ణా బోర్డు ..కోర్టుల్లో మాపై కేసులేసి మమ్మల్ని ఆపమంటే ఎట్లా?

చేతులెత్తేసిన కృష్ణా బోర్డు ..కోర్టుల్లో మాపై కేసులేసి మమ్మల్ని ఆపమంటే ఎట్లా?
  • సాగర్ లో ఏపీ కడుతున్న ప్రాజెక్టుకు అనుమతులు ఆపాలన్న తెలంగాణ లేఖపై కేఆర్ఎంబీ రిప్లై
  • గెజిట్ నోటిఫికేషన్‌‌ను సుప్రీంలో సవాల్ చేసి జోక్యం కోరడమేంటని ప్రశ్న
  • ఏకాభిప్రాయం లేనిదే వివాదాస్పద అంశాలపై నిర్ణయం తీసుకోలేమని వెల్లడి
  • మిగులు జలాల పేరుతో ప్రాజెక్టులు కడితే హక్కులు రావని హితవు 

హైదరాబాద్, వెలుగు: అనుమతులు లేకుండా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులెత్తేసింది. ఒకవైపు బోర్డుకు అధికారాలు కట్టబెట్టిన కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూనే, మరోవైపు ప్రాజెక్టులను ఆపాలని బోర్డు జోక్యం కోరడం పరస్పర విరుద్ధమని తేల్చిచెప్పింది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 అవార్డు ఇంకా వెలువడాల్సి ఉండటం, బోర్డు అధికార పరిధి వ్యవహారం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంలో తమకు పరిమితులు ఉన్నాయని స్పష్టం చేసింది.

సాగర్ లో ఏపీ చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ఆపాలంటూ ప్రభుత్వం రాసిన లేఖకు గురువారం బోర్డు ఇటు తెలంగాణకు, అటు ఏపీకి రిప్లై ఇచ్చింది. ప్రాజెక్టులని ఆపే విషయంలో తామేమీ చెయ్యలేమని చేతులెత్తేసింది. గతంలోనూ రెండు రాష్ట్రాల నుంచి ఇలాంటి విజ్ఞప్తులు వచ్చిన విషయాన్ని గుర్తుచేసిన కేఆర్ఎంబీ.. ఏదైనా ఒక రాష్ట్రాన్ని నిలువరించేలా ఆదేశాలు జారీ చేయడంలో తమకున్న పరిమితులను పలుమార్లు స్పష్టం చేశామంటూ నాలుగు కీలక అంశాలను లేఖలో ప్రస్తావించింది.

కోర్టుకెళ్లి.. బోర్డునే ఆపమంటే ఎట్ల?

కేంద్ర జలశక్తి శాఖ 2021లో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రాల జాబితాలోని అధికారాలకు వ్యతిరేకమని, కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని బోర్డు గుర్తుచేసింది. ఆ నోటిఫికేషన్‌‌ను పూర్తిగా రద్దు చేయాలని తెలంగాణ కోరిందని తెలిపింది. ‘‘పునర్విభజన చట్టం కింద ప్రాజెక్టుల మదింపు సహా బోర్డు అధికారాలు, విధులన్నింటికీ ఆ గెజిట్ నోటిఫికేషనే ఆధారం. బోర్డుకు అధికారాలు ఇచ్చే ఆ నోటిఫికేషన్‌‌నే తప్పుబడుతూ, మళ్లీ అదే బోర్డు జోక్యం చేసుకొని ఆదేశాలు ఇవ్వాలని కోరడం పూర్తిగా  విరుద్ధం’’ అని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది.

కేఆర్ఎంబీ 16వ సమావేశంలో ఆమోదించిన నిబంధనల ప్రకారం, ఏ విషయంలోనైనా బోర్డు ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకుంటుందని లేఖలో పేర్కొంది. వివాదాస్పద అంశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోతే, వాయిదా వేస్తున్నట్లు ప్రత్యేకంగా రికార్డు చేస్తే తప్ప ఆ అంశం తేలదని తెలిపింది. ఏకాభిప్రాయ నిబంధన వల్ల బోర్డు నిర్ణయాధికారం పరిమితమైందని, దీనికి తోడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌‌లో ఉండటంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిందని వివరించింది. అలాగే పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ ప్రకారం.. బోర్డు నిర్ణయాన్ని రాష్ట్రాలు అమలు చేయకపోతేనే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, న్యాయపరమైన అడ్డంకులు లేకుండా బోర్డు నిర్ణయం తీసుకున్నప్పుడే అది సాధ్యమవుతుందని వెల్లడించింది.

క్లియరెన్స్ తీసుకోవాల్సిందే

పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఇరు రాష్ట్రాలు గౌరవించి, తప్పనిసరిగా పాటించాలని కేఆర్ఎంబీ మరోసారి సూచించింది. దీని ప్రకారం ఏ కొత్త ప్రాజెక్టుకైనా అపెక్స్ కౌన్సిల్ అనుమతికి ముందే సంబంధిత బోర్డు నుంచి సాంకేతిక మదింపు, క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని గుర్తుచేసింది. ‘‘కేటాయించని జలాలు లేదా మిగులు జలాలు అందుబాటులో ఉన్నాయనే అంచనాతో ప్రాజెక్టుల రూపకల్పన లేదా నిర్మాణం చేపట్టినంత మాత్రాన, ఆ నీటి వినియోగంపై ఎలాంటి చట్టబద్ధమైన హక్కు గానీ, భరోసా గానీ లభించదు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను సమర్థవంతమైన ట్రిబ్యునల్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కాబట్టి రెండు రాష్ట్రాలు నిబంధనలు పాటించాలి’’ అని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది.