
- నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తే..
- కలెక్టర్‌ను కార్యకర్త అనిపిస్తరా ?
ములుగు, వెలుగు : ‘కేటీఆర్.. మీరు రైతుల సంక్షేమం వైపు ఉంటారో.. దళారి మాటలు విని వారికే సపోర్ట్ చేస్తారో’ తేల్చుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన నకిలీ విత్తనాలతో ములుగు జిల్లా కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలకు చెందిన 900ల మంది రైతులు నష్టపోతే.. వారికి పరిహారం ఇప్పించిన కలెక్టర్‌ను కాంగ్రెస్ కార్యకర్త అనిపిస్తారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ములుగు క్యాంప్ ఆఫీస్‌లో బుధవారం సీతక్క మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ దివాకర బాధ్యత చేపట్టిన నాటి నుంచి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం తనను కలచివేసిందన్నారు.
కేటీఆర్ సమక్షంలోనే కలెక్టర్‌ను అవమానించేలా మాట్లాడితే ఆయన పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ‘మీరు రైతుల పక్షాన ఉన్నట్లయితే.. రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టిన నర్సింహమూర్తిని బీఆర్‌ఎస్ నుంచి తొలగించి, కలెక్టర్‌పై చేసిన మాటలను ఖండించాలి’ అని డిమాండ్ చేశారు.
సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్‌రెడ్డి, ఇర్షవడ్ల వెంకన్న, ములుగు మండల అధ్యక్షుడు ఎండీ.చాంద్ పాషా పాల్గొన్నారు.