లోక్‌‌సభతో పాటే ఏప్రిల్, మే నెలలోనే ఎలక్షన్స్ జరిగే చాన్స్: కేటీఆర్

లోక్‌‌సభతో పాటే ఏప్రిల్, మే నెలలోనే ఎలక్షన్స్ జరిగే చాన్స్: కేటీఆర్
  • లోక్‌‌సభతో పాటే ఏప్రిల్, మే నెలలోనే ఎలక్షన్స్ జరిగే చాన్స్
  • జమిలి వచ్చినా మాకొచ్చే నష్టమేమీ లేదు
  • మా పార్టీ ఫస్ట్​ ప్రయారిటీ తెలంగాణనే.. మహారాష్ట్రలోనూ పోటీ
  • ఎన్నికలు వాయిదా పడితే పార్టీలో విభేదాలను 
  • పరిష్కరించుకునే టైమ్‌‌ దొరుకుతది
  • అభ్యర్థుల మార్పు ఉండదు.. కేసీఆర్ ప్రకటించినోళ్లకే బీఫామ్స్‌‌
  • కమ్యూనిస్టులు అడిగిన సీట్లు ఇవ్వడం కుదరలే.. అందుకే పొత్తు పెట్టుకోలే
  • ఈసారి 90కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమవుతాయేమోనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 10 లోగా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రాకపోతే.. పార్లమెంట్‌‌తో పాటే ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మంగళవారం బేగంపేట క్యాంపు ఆఫీసులో కొందరు ప్రింట్ మీడియా ప్రతినిధులతో ఆయన చిట్‌‌చాట్ చేశారు. ‘‘కేంద్రం జమిలి ఎన్నికలు తెచ్చే ఉద్దేశంతోనే రామ్​నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసింది. ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘వన్​నేషన్ – వన్​ఎలక్షన్’ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. గతంలోనూ ఇలాంటి చీప్ ట్రిక్స్ చూశాం. ప్రజలకిచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు కాబట్టే.. దేశమంతా ఒకేసారి ఎన్నికలను తెరపైకి తెస్తున్నది. ఒకవేళ కేంద్రం ‘వన్​నేషన్​– వన్​ఎలక్షన్’ తెస్తే దాన్ని ఆపే శక్తి ఏ పార్టీకి లేదు. బీజేపీ 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందుకే ఈ విధానం అమలు చేస్తారనే అనిపిస్తున్నది” అని అన్నారు. ఈనెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్​ప్రత్యేక సమావేశాల్లో ఏం జరుగుతుందనేది మోదీ, అమిత్​షా మినహా ఇంకెవరికీ తెలియదని విమర్శించారు.

కాల పరిమితి పెంచుతారా? రాష్ట్రపతి పాలన విధిస్తారా?

అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాతే దేశంలో ఎన్నికలు జరుగుతాయని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం మోదీకి లేదని అన్నారు. నాలుగైదు నెలలు ఆగితే పార్లమెంట్​ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటితోనే అసెంబ్లీకి ఎన్నికలు ఉండొచ్చని అంచనా వేశారు. దీనికి ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారనేది పార్లమెంట్​సమావేశాల్లోనే తేలుతుందని చెప్పారు. ‘‘రాజ్యాంగ సవరణ చేసి.. ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితిని పెంచుతారా? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ రాష్ట్రపతి పాలన పెడితే కేంద్రానికే అప్రతిష్ట. ఆ ఆలోచన చేయకపోవచ్చు” అని అన్నారు. మోదీ ఒక్కరోజు కూడా అధికారం వదులుకునే వ్యక్తి కాదని ఎద్దేవా చేశారు. జమిలి ఎన్నికలు వచ్చినా తమకొచ్చే నష్టమేమీ లేదని, ఒకవేళ జమిలి ఎన్నికలే వస్తే తమ పార్టీ ఫస్ట్​ప్రయారిటీ తెలంగాణనే అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. ఎన్నికలు వాయిదా పడితే పాలమూరు – రంగారెడ్డి, సీతారామ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటామని, పార్టీలో అంతర్గత విభేదాలను సర్దుబాటు చేసుకోవడానికి మరింత టైం దొరుకుతుందన్నారు.

మమ్మల్ని బీ టీమ్ అంటరా?

‘‘దేశంలో మోదీని, బీజేపీని మా పార్టీ విమర్శించినంతగా ఇంకే పార్టీ విమర్శించలేదు. అలాంటిది మమ్మల్ని బీజేపీకి బీ టీమ్ అంటున్నారు. మేము మోదీపై పోరాడుతున్నాం కాబట్టే బీఆర్ఎస్​నాయకులపై ఈడీ దాడులు జరిగాయి. ఒక్క కాంగ్రెస్​నాయకుడిపైన అయినా కేంద్ర ఏజెన్సీలు దాడి చేశాయా? బీజేపీతో కాంగ్రెస్ పార్టీకి ఎంతటి అవగాహన ఉందో ఇదే స్పష్టం చేస్తున్నది” అని ఆరోపించారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకున్నా ఇక్కడి బీజేపీ నాయకులు అడగడం లేదని, కాంగ్రెస్​పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రూ.4 వేల పింఛన్​ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసన్నారు. పాలమూరుపై కేసులు వేసి అడ్డుకున్నోళ్లు ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ప్రశ్నిస్తున్నారని, 1963లో నెహ్రూ శంకుస్థాపన చేసిన ఎస్సారెస్పీ కాలువలను నిన్నమొన్నటి దాకా కాంగ్రెస్​నాయకులు ప్రారంభించలేదా అని ప్రశ్నించారు.

అసంతృప్తులు మామూలే

65 ఏళ్లు పాలించినోళ్లు రెండు మెడికల్​కాలేజీలు పెడితే, తాము జిల్లాకు ఒక మెడికల్​కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్, నర్సింగ్​కాలేజీ, నవోదయ స్కూల్ కూడా​ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కమ్యూనిస్టు పార్టీలు అడిగిన సీట్లు ఇవ్వడం సాధ్యం కాలేదు కాబట్టే వారితో పొత్తు పెట్టుకోలేదు. మాకు 105 మంది సిట్టింగ్​ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో వారికి సీట్లు ఇవ్వలేకపోయాం. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విషయంలో వేచి చూసే ధోరణిలోనే ఉన్నాం. రాజకీయాలు రైలు ప్రయాణం లాంటివి. అక్కడక్కడా అసంతృప్తులు ఉండటం.. పార్టీలు మారడం సర్వసాధారణం. ఇక్కడ జీవితకాల ఒప్పందాలు ఉండవు. పదవులు కావాల్సిన వారు ప్రత్యామ్నాయంవైపు చూస్తారు” అని చెప్పుకొచ్చారు.

ఏపీ పరిణామాలపై మేమెందుకు స్పందించాలి

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై తామెందుకు స్పందించాలని కేటీఆర్​ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్​పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు.. ‘‘ఏపీ రాజకీయ పరిణామాలతో మాకు సంబంధం లేదు. అక్కడ ఏం జరుగుతోందనేది వాళ్ల తలనొప్పి. అక్కడి అంశాలపై మాట్లాడటం, జోక్యం చేసుకోవడం, వ్యాఖ్యానించడం ఎందుకు? ఇక్కడ మాకు ఇతర తలనొప్పులు ఉన్నాయి. కొందరు యూట్యూబ్​చానళ్లు పెట్టి రోజూ సీఎంను తిడుతున్నారు. తెలంగాణలో అతి మంచితనం, ప్రజాస్వామ్యం ఎక్కువైనట్టు ఉంది. సీఎంను పట్టుకొని ప్రతి లేకి వెదవ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆంధ్ర, కర్నాటకలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్లాయి. వాటి విధానాల మీద నేనెందుకు మాట్లాడాలి. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అంటే రన్నింగ్ కామెంట్రీ చేయడం కాదు. జాతీయ అంశాలపై మాట్లాడాలి. ఏపీలో పరిస్థితులు, కేసు పూర్వాపరాలు తెలియకుండా తీర్పులివ్వలేం. మేం తెలంగాణ పాలనపైనే దృష్టి కేంద్రీకరించాం’’ అని వెల్లడించారు.

రెండో స్థానం కోసమే ప్రతిపక్షాల పోటీ

బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చి వేరేవాళ్లకు బీఫామ్‌‌‌‌‌‌‌‌ ఇస్తారనేది వట్టి ప్రచారం మాత్రమేనని కేటీఆర్ స్పష్టంచేశారు. అభ్యర్థులను ప్రకటించే సమయంలో తమ పార్టీ అధినేత కేసీఆర్ ​చెప్పినట్టుగా.. ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు పనితీరు మార్చుకోకుంటే ఆలోచిస్తామని, మిగతా అందరికీ బీఫామ్‌‌‌‌‌‌‌‌లు ఇస్తామని చెప్పారు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని ప్రజలు నిర్ధారణకు వచ్చారని, రెండో స్థానం కోసమే ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుంటే తమ దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు లెక్కలు వేసుకున్నాయని, తాను నిర్మించిన నాయకత్వంపై నమ్మకంతోనే కేసీఆర్​ సిట్టింగులకే సీట్లు ఇచ్చారని వివరించారు. రాష్ట్రంలో మూడోసారి కేసీఆరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. బీఆర్ఎస్​సీఎం అభ్యర్థి కేసీఆర్ అని.. ప్రతిపక్షాల్లో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని నిలదీశారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

‘‘జాతీయ పార్టీలు ఢిల్లీ బానిసలు. ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ ప్రజలు ఆ బానిస పార్టీలను అంగీకరించబోరు. తెలుగువాళ్ల గౌరవం పీవీపై చెప్పులు విసిరిన పార్టీ కాంగ్రెస్. కేవీపీ రామచంద్రరావు, షర్మిల తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను ఇప్పుడు వాళ్లు గెలిపిస్తారట” అని ఎద్దేవా చేశారు. కేవీపీ చేతిలో రేవంత్, కిరణ్​కుమార్​రెడ్డి చేతిలో కిషన్​రెడ్డి ఉన్నారని.. తెలంగాణ వ్యతిరేకుల చేతుల్లో ఉన్న పార్టీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రేవంత్​తెలంగాణ వాది కాదని.. తెలంగాణకు పట్టిన వ్యాధి అని మండిపడ్డారు.‘‘తెలంగాణ ప్రజలు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారంటే అన్యాయంగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం తామే ఇచ్చామని బ్రిటిష్​ప్రధాని రిషీ సునాక్​అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు అంటే అంతే దరిద్రంగా ఉంటుంది” అని విమర్శించారు.

ఎన్నికలపై ప్రజలకు స్పష్టత ఉంది. ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయి. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో మా పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. 90కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తాం. పదేండ్లుగా మా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారు.
- మంత్రి కేటీఆర్​