చెన్నూరులో బీఆర్ఎస్నే ఆశ్చర్యపరిచిన వివేక్ వెంకటస్వామి గెలుపు

చెన్నూరులో బీఆర్ఎస్నే ఆశ్చర్యపరిచిన వివేక్ వెంకటస్వామి గెలుపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే.. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ.. వారు అనుకున్నట్లు జరగలేదు. బీఆర్ఎస్ కు ప్రజల్లో ఓటమి తప్పలేదు.

బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మొదటిసారి మంత్రి కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ప్రజలిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ఫలితాలు నిరాశపర్చినా.. అసంతృప్తి లేదన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ నిరాశపడొద్దని సూచించారు. అయితే.. ఇక్కడే మంత్రి కేటీఆర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు బాగా డెవలప్ మెంట్ చేసినా ఎందుకు ఓడిపోయామన్నది తమకు అర్థం కావడం లేదని, దీనిపై తాము చర్చించుకుంటామని చెప్పారు. 

ముఖ్యంగా కోల్ బెల్ట్ ప్రాంతంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమిపై తాము విశ్లేషించుకుంటామని కేటీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పారు. ముఖ్యంగా చెన్నూరు ప్రాంతాన్ని ఉదహరణగా చెప్పారు. తమ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినా ఎందుకు ఓటమి చెందారనేదానిపై విశ్లేషించుకుంటామన్నారు. చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీ. వివేక్ వెంకటస్వామి.. బాల్క సుమన్ పై గెలుపొందారు. వివేక్ కు 87 వేల 541 ఓట్లు వచ్చాయి. బాల్క సుమన్ కు 50 వేల 26 ఓట్లు వచ్చాయి. అంటే..  37 వేల 515 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి గెలుపొందారు. 

సింగరేణి సంస్థకు తాము చేసినంత మేలు గతంలో ఏ పార్టీ చేయలేదన్నారు కేటీఆర్. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసే విషయంలో కార్మికులకు అండగా ఉండి అడ్డుకున్నామన్నారు. కార్మికులకు 32శాతం బోనస్ ఇచ్చామన్నారు. కార్మికులకు ఇచ్చిన 10 హామీలను నెరవేర్చామని చెప్పారు. వారసత్వ ఉద్యోగాల సమస్యను కూడా పరిష్కరించామన్నారు కేటీఆర్. అయితే.. బీఆర్ఎస్ హామీలను సింగరేణి కార్మికులతో పాటు అక్కడి ప్రజలు ఎవరూ నమ్మలేదు. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి.

చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని ఓడించేందుకు బాల్క సుమన్ చాలా కుట్రలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఒకదశలో వివేక్ కార్యాలయాలు, ఇండ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయించారు. వివేక్ ను ఉక్కిరి బిక్కిరి చేసి.. ఓడగొట్టాలని పథకం పన్నారు. అంతేకాదు.. వివేక్ సోదరుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ ఇంటిలోనూ ఐటీ, ఈడీ దాడులు చేయించడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కావాలనే ఈ దాడులు చేయించిందని ప్రజలు బలంగా విశ్వసించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎవరూ నమ్మలేదు. వారు ఇచ్చిన హామీలను విశ్వసించలేదు. 

అంతేకాదు.. కేటీఆర్ చెప్పినట్లు చెన్నూరుతో పాటు ఇతర నియోజకవర్గాల్లో పెద్దగా డెవలప్ మెంట్ లేదు. ఈ విషయాన్ని అక్కడి ప్రజలను ఎవర్నీ అడిగినా చెబుతారు. ఒకవేళ నిజంగానే డెవలప్ మెంట్ చేస్తే ఎందుకు గెలవరనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. చెన్నూరులో బాల్క సుమన్ ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శ ఉంది. ఆయన ఎప్పుడు ప్రగతి భవన్ లో లేదంటే కేసీఆర్, కేటీఆర్ వెంటే ఎక్కువగా ఉండి.. నియోజకవర్గాన్ని అస్సలు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో బాల్క సుమన్ కు ఓటమి తప్పలేదు.