
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అస్థిత్వాన్ని గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా అని ప్రధాని నరేంద్ర మోదీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీ మంత్రి లోకేశ్ కు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ఇచ్చిన ఇండియా మ్యాప్ఫొటోలో తెలంగాణ లేకపోవడంపై గురువారం కేటీఆర్ఓ ప్రకటనలో తప్పుబట్టారు. తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు, అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలా బీజేపీ ఏపీ అధ్యక్షుడు దేశ చిత్రపటాన్ని వాడారని తెలిపారు. కేవలం ఉమ్మడి ఏపీనే చూపించడం దారుణమని విమర్శించారు. దేశ చిత్రపటం నుంచి తమ చరిత్రనే తొలగిస్తే తామెవరమని నిలదీశారు. ఇది అధికారిక విధానమా లేదా పొరపాటున జరిగిందా అన్న విషయంపై మోదీ స్పష్టతనివ్వాలని కోరారు. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్రసాధన కోసం చేసిన పోరాటాలు, బలిదానాలను అగౌరవపరచడమేనన్నారు. దీనిపై బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ లేకుండా మ్యాప్ ఏంది?: దాసోజు శ్రవణ్
తెలంగాణ ఏర్పాటును బీజేపీ, టీడీపీ ఇంకా గుర్తించడం లేదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఏపీ మంత్రి, టీడీపీ నాయకుడు నారా లోకేశ్‌కు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్.. తెలంగాణలేని ఇండియా పటాన్ని అందజేయడం దేనికి సంకేతమని ఆయన నిలదీశారు. బీజేపీ తీరును ఖండిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తెలంగాణను చూపిస్తూ ఉన్న ఇండియా చిత్రపటాన్ని ఇవ్వడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు. ‘‘తెలంగాణ ఏర్పాటును చంద్రబాబు అడ్డుకున్నరు.
తెలంగాణలేని ఫొటోను బీజేపీ నేత ఇవ్వడం, టీడీపీ నేత తీసుకోవడం చూస్తుంటే తెలంగాణపై వారికి నరనరాల్లో ఉన్న ద్వేషాన్ని సూచిస్తున్నది” అని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలేని ఫొటో ఇవ్వడమంటే అది తెలంగాణ అస్తిత్వంపై దాడే అని మండిపడ్డారు. బండి సంజయ్ ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు? వెంటనే బీజేపీ, టీడీపీ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.