
వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. ఇటీవల బయో ఏషియా( Bio Asia ) సదస్సు విజయవంతంగా నిర్వహించుకున్నాం ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని.. మరిన్ని సీఐఐ( CII ) సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాంగణాలు నెలకొల్పాయని.. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయన్నారు. 2030 నాటికి 250 బిలియన్ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్నామన్న కేటీఆర్.. లైఫ్‌సైన్స్‌తో పాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా మారిందని వ్యాఖ్యానించారు.
9 బిలియన్ టీకాలు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్‌లోనే తయారు అవుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన డివైజెస్ పార్కులోనే ఉందన్నారు. తెలంగాణలో అతి పెద్ద మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశాం. దేశానికే హైదరాబాద్ మొబిలిటీ కేంద్రంగా మారుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.