- కాళేశ్వరంతో ఒక్క ఎకరానికీ సాగునీరు అందలే
- కొనుక్కొచ్చినా, అడుక్కొచ్చినా.. రైతులకు కరెంట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్
వేములవాడ/చందుర్తి, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రిగా పని చేసి, ప్రజలకు ఏం సేవ చేశారో చెప్పాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగులలో ‘ఈడుగు శంకరన్న– అమరుల యాది’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వేములవాడలో మీడియాతో ఆమె మాట్లాడారు.
కాళేశ్వరంతో సిరిసిల్ల, వేములవాడ నియోజకర్గాలకు ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందలేదన్నారు. కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చి మూడేండ్లయినా పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం కొనుక్కొచ్చినా, అడుక్కొచ్చినా రైతులకు నవంబర్ వరకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఎములాడ రాజన్న ఆలయాన్ని కాంక్రీట్ తో కడుతూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నారని అన్నారు. గుడికి నిధులిచ్చిన విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
ఇడుపు కాయితం అయినట్లేనా!
ఇటీవల సీఎం సిరిసిల్లలో సభ పెట్టి తిట్లు, గాయి గాయి చేశారని, ఆ ప్రాంతానికి ఆయన చేసేందేమీ లేదని విమర్శించారు. నేరెళ్ల బాధితుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాళ్లను మళ్లీ మోసం చేశారని విమర్శించారు. బాధితులకు రూ. కోటి పరిహారం, మూడు ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు.
మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తమది వైఎస్, డీఎస్ జోడీ అంటున్నారని, కానీ వాళ్ల మాటలు చూస్తుంటే వారికి ఇడుపు కాయితం అయినట్లే కనిపిస్తుందన్నారు. కేసీఆర్ తో ఇప్పుడు రాజకీయంగా విభేదించినా, దారులు వేరైనా సమాజం కోసం ఆయన చేసిన త్యాగాన్ని మాత్రం మర్చిపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఈడుగ రంజిత్ కుమార్, అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క, మాజీ జడ్పీటీసీ నాగ్రం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
