‘మాస్​ కాపీయింగ్​’ ఎగ్జామ్​ సెంటర్లను ఎత్తేసిన కేయూ

‘మాస్​ కాపీయింగ్​’ ఎగ్జామ్​ సెంటర్లను ఎత్తేసిన కేయూ
  •     గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల సిండికేట్​కు బ్రేక్​
  •     కాలేజీలపై విద్యార్థుల నుంచి  వసూళ్ల ఆరోపణలు

నిర్మల్, వెలుగు: గత కొంత కాలంగా గ్రామీణ ప్రాంతాల్లోని  కొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో కొనసాగుతున్న మాస్​కాపీయింగ్‌కు కేయూ అధికారులు చెక్​ పెట్టారు. మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లోని  ఎగ్జామ్​ సెంటర్లను ఎత్తేసి, సమీప పట్టణాలకు మార్చారు. కొంతకాలంగా గ్రామీణ ప్రాంతాల్లోని సెంటర్లలో కొన్ని ప్రైవేట్ కాలేజీ మేనేజ్‌మెంట్లు సిండికేట్‌గా మారి మాస్‌ కాపీయింగ్​కు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై కాకతీయ యూనివర్సిటీకి ఫిర్యాదులు వెళ్లాయి. సీరియస్‌గా స్పందించిన కేయూ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లోని సెంటర్లను ఎత్తేశారు. ఇప్పటికే డిగ్రీ పరీక్షలు స్టార్ట్​ కాగా వీటికి సమీప పట్టణాల్లోనే సెంటర్లు ఏర్పాటు చేశారు. 

పాస్​ గ్యారంటీ పేరిట ప్రచారం 

జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని చాలా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు పాస్ ​గ్యారంటీ అంటూ ప్రచారం చేస్తున్నాయి.  సిండికేట్‌గా మారి పరస్పరం ఎగ్జామ్ ​సెంటర్లు వేయించుకొని మాస్​కాపీయింగ్‌కు పాల్పడుతున్నాయి. ఇలా కాలేజీల్లో కనీస సౌలత్‌లు లేకపోయినా ​సెంటర్లు ఏర్పాటు చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఫీజు రీఎంబర్స్​మెంట్‌ లక్ష్యంగా పాస్​ గ్యారంటీ పేరిట విద్యార్థులను ఆకర్షిస్తూ అడ్మిషన్లు తీసుకొనేవి. ఎగ్జామ్స్​ టైంలో 
విద్యార్థుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  చాలా రోజుల నుంచి ఈ వ్యవహారంపై  ఫిర్యాదులు వస్తున్నా ఇంతకాలం మేనేజ్‌మెంట్లు తమ పలుకుబడితో సెంటర్లను రెన్యూవల్​ చేయించుకున్నాయి. అయితే ఫిర్యాదులపై ఇటీవల కేయూ అధికారులు ఈ కాలేజీల్లోని ఎగ్జామ్ సెంటర్లను రద్దు చేశారు.  అయితే సెంటర్లు రద్దు చేయడంతో స్టూడెంట్స్​ సమీప టౌన్లకు వెళ్లాల్సి రావడం కొంత ఇబ్బందేనని పలువురు భావిస్తున్నారు. 

నిర్మల్ ​జిల్లాలో 7 సెంటర్లు ఎత్తివేత 

నిర్మల్ జిల్లాలో మొత్తం మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండగా 25 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. నిర్మల్, బైంసా, ఖానాపూర్ పట్టణ ప్రాంతాలతో పాటు పలు మండల కేంద్రాలలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కనీస సౌకర్యాలు లేకుండానే నిర్వహిస్తున్నారన్న  విమర్శలున్నాయి.  నిర్మల్ లో 7 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, ఖానాపూర్‌‌లో 4, సారంగాపూర్, దిలావర్పూర్, మామడ, లక్ష్మణ చందా మండల కేంద్రాలు,  బైంసా, ముథోల్‌, కుబీర్‌‌లలో 2 చొప్పున, కల్లూరు లోకేశ్వరం, కడెంలలో ఒక్కో కాలేజీలు ఉన్నాయి. మాస్​ కాపీయింగ్, వసూళ్ల ఫిర్యాదులు వస్తున్న సారంగాపూర్ మండలంలోని 2, దిలావర్పూర్, కుబీర్, మామడ, లక్ష్మణ చందా, కడెం మండలాలల్లోని సెంటర్లను రద్దు చేశారు.