పీహెచ్‌‌డీ అడ్మిష‌‌న్లలో అవ‌‌క‌‌త‌‌వ‌‌క‌‌ల‌‌పై విద్యార్థి సంఘాల నిరసన

పీహెచ్‌‌డీ అడ్మిష‌‌న్లలో అవ‌‌క‌‌త‌‌వ‌‌క‌‌ల‌‌పై  విద్యార్థి సంఘాల నిరసన

హసన్ పర్తి, వెలుగు :  కాక‌‌తీయ యూనివ‌‌ర్సిటీలో ఇటీవ‌‌ల చేప‌‌ట్టిన పీహెచ్‌‌డీ కేట‌‌గిరీ-2 అడ్మిష‌‌న్లలో అవ‌‌క‌‌త‌‌వ‌‌క‌‌లు జ‌‌రిగాయంటూ పీహెచ్‌‌డీ అడ్మిష‌‌న్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులతో పాటు, విద్యార్థి సంఘాల నేత‌‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 75 శాతం సీట్లను పార్ట్‌‌టైం ఉద్యోగుల‌‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగుల‌‌కు అమ్ముకున్నార‌‌ని స్టూడెంట్  యూనియన్  లీడర్లు ఆరోపించారు. వీసీ, రిజిస్ట్రార్‌‌, డీన్లు కుమ్మక్కై పెద్దమొత్తంలో అడ్మిషన్లను అమ్ముకున్నార‌‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంగ‌‌ళ‌‌వారం  కేయూ ప్రిన్సిపాల్  ఆఫీసులో స్టూడెంట్లతో కలిసి విద్యార్థి సంఘాల నేతలు శాంతియుతంగా నిర‌‌స‌‌న వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాకతీయ యూనివర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వర్సిటీకి చేరుకొని.. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను బలవంతంగా బయటికి పంపించే  ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసుల‌‌కు, విద్యార్థి నేత‌‌ల‌‌కు మ‌‌ధ్య  తోపులాట‌‌  జరిగింది. 

ఈ తోపులాటలో ఎస్ఐ విజయ్  కుమార్  కొంతమంది విద్యార్థి నేతలపై  దాడిచేసి గాయ‌‌ప‌‌ర్చారు. దీంతో వారు కార్యాల‌‌యంలోని ఫ‌‌ర్నిచ‌‌ర్‌‌ ను ధ్వంస‌‌ం చేశారు. అనంతరం విద్యార్థి సంఘం నేతలను అదుపులోకి తీసుకొని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారిపై కేసు నమోదు చేశామని ఎస్ సురేశ్  తెలిపారు.