
కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన కొమురం మారుతి అనే రైతు చనిపోయినా అతడి కుటుంబానికి రైతుబీమా అందడం లేదు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. మారుతికి గ్రామ శివారులోని సర్వే నంబర్లో 174/1/21/4 లో ఎక రం పది గంటల భూమి ఉంది. దీనికి డిజిటల్ పాస్ బుక్ కూడా జారీ అయ్యింది. అతడు 2021 నవంబర్ 15 న చనిపోయాడు. రైతు బీమా కోసం అతడి భార్య పద్మ , కొడుకు నరేశ్ గ్రామ పంచాయతీలో అదే ఏడాది డిసెంబర్ 12 న డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు. రైతు బీమా ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆన్లైన్లో పేరు లేదని ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేశారు.
దీంతో పద్మ మార్చి 23న ఐటీడీఏ పీవో కు అర్జీ పెట్టుకుంది. అయినా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. కాగా, అగ్రికల్చర్ రికార్డుల్లో మారుతి బతికే ఉన్నాడు. రైతు చనిపోతే ఆ వివరాలను పోర్టల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు నమోదు చేయకపోవడంతోనే సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఆఫీసర్లు గుర్తించి తమకు బీమా ఇప్పించాలని మారుతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.