కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖలో అవినీతి ప్రకంపనలు రేగుతున్నాయి. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన తిర్యాని ఎస్సై వెంకటేష్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో కాగజ్‌నగర్‌లో టాస్క్ ఫోర్స్ ఎస్సైగా విధులు నిర్వహించిన సమయంలో.. వెంకటేష్ తీవ్రమైన అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మట్కా నిర్వాహకులు, పశువుల అక్రమ రవాణా చేసే ముఠాలతో చేతులు కలిపి వారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు విచారణలో తేలింది.అయితే ఈ అవినీతి వ్యవహారంలో ఎస్సై వెంకటేష్ చాలా తెలివిగా వ్యవహరించినప్పటికీ.. టెక్నాలజీ ఆధారంగా అధికారులు ఆయన్ను పట్టించాయి. నిందితులతో జరిపిన ఫోన్ కాల్స్ డేటా, అలాగే ఫోన్ పే ద్వారా జరిగిన నగదు బదిలీలే ఆయన పాపాలను బయటపెట్టాయి. పక్కా ఆధారాలతో దొరికిపోవడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుతం ఎస్సై వెంకటేష్ అవినీతిపై లోతైన విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
