
ముషీరాబాద్,వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వంలో వంద అడుగుల జ్యోతిబాపూలే విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని బీసీ కులాల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి కోరారు. ఈ మేరకు సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ను వివిధ బీసీ సంఘాల నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, చిన్న శ్రీశైలం యాదవ్, బాలరాజ్ గౌడ్, శేఖర్ సగర, సింగం నరేశ్, లింగంగౌడ్ కలిశారు.
అనంతరం కుందారపు గణేశ్ చారి మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధిని కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
కుల వృత్తులను ప్రోత్సహించండి
రాష్ట్రంలో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిం చి కులవృత్తులను ప్రోత్సహించాలని తెలంగాణ గౌడ్ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను సమన్వయ కమిటీ ప్రతినిధులు కలిశారు. బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తీసి రాబోయే స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేయాలన్నారు.
రాబోయే స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల తోపాటు బడ్జెట్లో బీసీలు, కుల వృత్తిదారులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారని బాలరాజు గౌడ్ తెలిపారు. కలిసిన వారిలో సమన్వయ కమిటీ ప్రతినిధులు ఎల్లికట్టె విజయ్ కుమార్ గౌడ్, కేశం నాగరాజు గౌడ్, బండి సాయన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.