కునో నేషనల్‌ పార్క్‌లో మరో చిరుత మృతి

కునో నేషనల్‌ పార్క్‌లో మరో చిరుత మృతి

మధ్యప్రదేశ్‌లోని  కునో నేషనల్‌ పార్క్‌లో మరో చిరుత మృతి చెందింది.  ‘తేజస్‌’ అనే  మగ చిరుత చనిపోయింది. కునో నేషనల్ పార్కులోని మానిటరింగ్‌ బృందం చిరుత మెడలో గాయం గుర్తులను గమనించి....పాల్పూర్‌ లోని వన్యప్రాణి విభాగానికి తరలించారు. అక్కడ చిరుత చికిత్స పొందుతూ మృతి చెందింది. తాజాగా చనిపోయిన చిరుతతో కలిపి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్‌లో మొత్తం 4 చిరుతలు, 3 చిరుత పిల్లలు మరణించాయి. 

తేజస్‌ చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చిరుత  మృతికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. చిరుత మెడపై గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. అవి ఎలా అయ్యాయి అనే విషయంలో విచారణ చేస్తున్నారు. 

ప్రాజెక్టు చీతాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి చిరుతలను కునో నేషనల్‌ పార్క్‌కు తరలించింది. ఈ చిరుతల్లో ఇప్పటి వరకు నాలుగు చిరుతలు, మరో మూడు పిల్లలు మృతి చెందాయి. మార్చి 27న సాషా అనే ఆడ చిరుత కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించింది.
ఆ తర్వాత ఏప్రిల్‌ 13న ఉదయ్‌ అనే మగ చిరుత కార్డియో పల్మనరీ ఫెయిల్యూర్‌తో, మే 9న దక్ష అనే ఆడ చిరుత సంభోగం సమయంలో గాయపడి మృతి చెందింది. మే 25వ తేదీన మూడు చిరుత పులి పిల్లలు మరణించాయి. 

మరోవైపు  కునో నేషనల్ పార్కులో  చిరుతల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.   ప్రతికూల వాతారణ పరిస్థితులు, అనారోగ్య సమస్యలతో చిరుతులు వరుసగా చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.