నెట్‌ఫ్లిక్స్‌లో 'కురుక్షేత్రం' యానిమేషన్ సిరీస్.. పురాణ యుద్ధ గాథ సరికొత్తగా.. ఎప్పుడంటే?

నెట్‌ఫ్లిక్స్‌లో 'కురుక్షేత్రం' యానిమేషన్ సిరీస్.. పురాణ యుద్ధ గాథ సరికొత్తగా.. ఎప్పుడంటే?

ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మైథలాజికల్ చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది.  అందుకు అనుగుణంగానే భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు నటీనటులు లేకపోయినా బాక్సాఫీస్ ను షేక్ చేయోచ్చు అని నిరూపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే ఇటీవల విడుదలైన యానిమేషన్ చిత్రం 'మహావతార్ నరసింహా' .  ఇప్పుడు సినిమాలే కాదు OTT ప్లాట్ ఫామ్స్ కూడా  పురాణాలు, పౌరాణిక అంశాలతో కూడిన వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నాయి.

 నెట్‌ఫ్లిక్స్ 'కురుక్షేత్రం'

లేటెస్ట్ గా నెట్‌ఫ్లిక్స్ తన మొట్టమొదటి పౌరాణిక యానిమేషన్ సిరీస్‌ ‘కురుక్షేత్రం’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. మహాభారతంలోని అద్భుతమైన కథాంశం ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్‌కి ప్రముఖ గీత రచయిత గుల్జార్ సాహిత్యం అందిస్తున్నారు. ఈ యానిమేటెడ్ సిరీస్ ను అను సిక్కా రూపొందించగా, ఆలోక్ జైన్, అను సిక్కా, అజిత్ అంధారే నిర్మాతలుగా వ్యవహరించారు. ఉజాన్ గంగూలీ రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ మన పురాణ గాథలకు సరికొత్త భాష్యం చెప్పనుంది.

సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే.. 

ఈ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం యుద్ధాన్ని మాత్రమే కాకుండా, అందులో పాల్గొన్న 18 మంది ప్రముఖ యోధుల అంతర్గత సంఘర్షణలను, వారి ప్రతీకారాలను, బంధువుల మధ్య జరిగిన ఈ భీకర పోరాటం కలిగించిన విధ్వంసకర ఫలితాలను వివరిస్తుంది. ప్రతి ఒక్క యోధుడి దృక్కోణం నుంచి కథను ఆవిష్కరించడం, ఈ పౌరాణిక గాథకు మరింత లోతును జోడిస్తుంది. మొత్తం 18 ఎపిసోడ్‌లుగా రూపొందించిన ఈ సిరీస్‌, రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం తొమ్మిది ఎపిసోడ్‌లతో అక్టోబర్ 10న స్ట్రీమింగ్ కానుంది.

►ALSO READ | Kantara: Chapter 1: 'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1' రికార్డులు.. తెలుగు హక్కులకు భారీ డీల్!

ఈ సిరీస్ గురించి అను సిక్కా మాట్లాడుతూ, “కురుక్షేత్ర యుద్ధం మర్చిపోలేనిది. ఇది కర్తవ్యం, విధి, నైతికత మధ్య జరిగిన ఘర్షణ. ఈ యానిమేషన్ సిరీస్ ద్వారా మనం కురుక్షేత్రంలోని 18 రోజుల యుద్ధాన్ని ప్రతి యోధుడి కోణం నుంచి చూస్తాం. ఇది పౌరాణిక కథనాలకు, దృశ్యరూప కథాశక్తికి ఒక అద్భుతమైన కలయిక రూపంలో ఉంటుందని తెలిపారు.

ప్రస్తుతం రణబీర్ కపూర్, సాయిపల్లవి, యష్ వంటి నటీనటులతో నితేశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం‘రామాయణం’ . దీనిని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.  ఇందులో మొదటి భాగాన్ని 2026లో దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కురుక్షేత్రం సిరీస్ రావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతుంది. గతంలో ‘జై హనుమాన్’ వంటి యానిమేషన్ సిరీస్‌లను రూపొందించిన నెట్‌ఫ్లిక్స్..  ఇప్పుడు ‘కురుక్షేత్రం’తో పౌరాణిక యానిమేషన్ విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనేందుకు రెడీ అవుతోంది. మరి ఈ  ‘కురుక్షేత్రం’ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకోనుందో చూడాలి మరి.