
చేయాలనే తపన ఉంటే వయసుతో సంబంధం లేదనేది చాలాసార్లు ప్రూవ్ అయిందే. అరవయ్యేళ్లు రాగానే ‘కృష్ణా, రామా’ అనుకుంటూ ఇంట్లో కూర్చోవాలి అనుకుంటారు చాలామంది. కానీ, ఈ బామ్మ ఏకంగా స్టేట్ లిటరసీ ఎగ్జామ్ రాసి 89 శాతం మార్కులు తెచ్చుకుంది!
కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్టేట్ లిటరసీ మిషన్’ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి సంవత్సరం ఒక ఎగ్జామ్ పెడుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పరీక్ష రాయొచ్చు. కొట్టాయం జిల్లాకు చెందిన కుట్టియమ్మ ఈ మధ్య ఆ పరీక్ష రాసింది. ఆమె వయసు ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 104 ఏండ్లు. ఈ పరీక్షలో వంద మార్కులకు 89 మార్కులు తెచ్చుకుంది. ఆ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వాసుదేవన్ శివన్‌కుట్టి ఆమె నవ్వుతున్న ఫొటోతో కలిపి ట్వీట్ చేశారు. ‘జ్ఞాన ప్రపంచంలోకి ప్రవేశించడానికి వయసు అడ్డంకి కాదు. అత్యంత గౌరవం, ప్రేమతో.. కుట్టియమ్మకు, మిగిలిన వారందరికి శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
ఇంట్లనే క్లాసులు
104 ఏండ్ల కుట్టియమ్మ చిన్నతనంలో బడికి వెళ్లలేదు. కానీ, ఎప్పటికైనా చదువుకోవాలని ఉండేదట. ‘సాక్షరత ప్రేరక్ రెహ్నా’ కార్యక్రమం వల్ల చదవడం, రాయడం నేర్చుకుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తన ఇంట్లోనే క్లాస్‌లు వినేది. అలా నాలుగో క్లాస్ పరీక్ష రాయడానికి ఎలిజిబిలిటీ దక్కించుకుంది. కొట్టాయంలోని అయర్కున్నం పంచాయతీలో నిర్వహించిన ‘సాక్షరత’ పరీక్షకు హాజరైంది. కుట్టియమ్మ ఈ పరీక్షలో వందకు 89 మార్కులు సాధించిన విషయం వైరల్ అయ్యింది. కుట్టియమ్మ పట్టుదల గురించి లోకల్‌గా, నెట్లో వైరల్ కావడం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అంటున్నారు నెటిజన్లు. ఆమె మరింత చదువుకోవాలని కోరుతున్నారు చాలామంది.