ఆయన పాట కట్టారంటే పది కాలాలు నిలిచిపోవాల్సిందే

ఆయన పాట కట్టారంటే పది కాలాలు నిలిచిపోవాల్సిందే

శంకరా నాద శరీరాపరా అంటూ భక్తి భావాన్ని ఒలికించినా..ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం అంటూ చిలిపి అల్లర్లు చేయించినా..చందమామ రావే జాబిల్లి రావే అంటూ చిన్నపిల్లలతో గోరు ముద్దులు తినిపించినా..నీకోసం వెలసింది ప్రేమమందిరం అంటూ ప్రణయ గీతాలు పలికించినా..మాట ఏదైనా ఆయన పాట కట్టారంటే పది కాలాలు నిలిచిపోవాల్సిందే. పసి పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు విని పులకించిపోవాల్సిందే. సినీ సంగీత ప్రపంచంలో ప్రభంజనం సృష్టించిన ఆయనే.. కేవీ మహదేవన్. యాభయ్యేళ్ల కెరీర్‌‌లో ఆరువందల యాభైకి పైగా సినిమాలకు సంగీతం అందించిన ఈ ఘనాపాటి వర్థంతి సందర్భంగా ఆయనకిది ప్రత్యేక నివాళి. 

అలా మొదలై..

మహదేవన్‌ పూర్తి పేరు కృష్ణన్ కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్. 1917లో మార్చ్ 14న తమిళనాడులోని నాగర్‌‌కోయిల్‌కి చెందిన తమిళ అయ్యర్ల కుటుంబంలో జన్మించారాయన. తండ్రి వెంకటాచలం భాగవతార్‌‌ గోటు వాద్యంలో నిపుణుడు. తాతగారు కూడా సంగీత విద్వాంసులే. దాంతో చిన్నతనం నుంచి మహదేవన్‌కి సంగీతంపై మక్కువ ఏర్పడింది. ముఖ్యంగా నాదస్వరాన్ని ఎంతో ఇష్టపడి నేర్చుకున్నారు. శాస్త్రీయ సంగీతం పైన కూడా పట్టు సంపాదించారు. చిన్నతనంలోనే కచేరీలు చేశారు. ఏడో తరగతి వరకే చదివారు. అయితే సంగీత దర్శకుడు కావాలనే ఆలోచన మొదట లేదు. నటుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. కొన్ని నాటకాల్లో యాక్ట్ చేశారు. పన్నెండేళ్ల వయసున్నప్పుడు ఓ నిర్మాత వెతుక్కుంటూ వచ్చి ‘మాతృభూమి’ అనే సినిమాలో నటించమని అడిగితే మద్రాస్ వెళ్లారు మహదేవన్. కానీ ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. దాంతో బాలగంధర్వ గానసభలో చేరారు. రెండేళ్ల పాటు ఆ సంస్థ వేసే నాటకాల్లో యాక్ట్ చేశారు. కానీ సినిమాలపై ఆశ తగ్గలేదు. అనుకోకుండా ఓసారి ‘తిరుమంగై ఆళ్వార్’ అనే సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా చోటు దక్కింది. వెంటనే ఓకే అనేశారు. అప్పుడాయనకి తెలీదు.. భవిష్యత్తులో తన జీవితం ఊహించని మలుపు తిరగబోతోందని.

మిత్రుడు చెప్పాడని..

మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడని అంటారు. మహదేవన్ విషయంలోనూ అదే జరిగింది. నటుడిగా కంటిన్యూ అవుదామనుకుంటున్న సమయంలో ఓ స్నేహితుడు సంగీత దర్శకత్వ శాఖలో చేరితో త్వరగా రాణిస్తావంటూ సలహా ఇచ్చాడు. దాంతో మనసు అటువైపు మళ్లింది. సలహా ఇచ్చిన మిత్రుడి సాయంతోనే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్వీ వెంకట్రామన్ దగ్గర అసిస్టెట్‌గా చేరారు. అప్పటికే అక్కడ వర్క్ చేస్తున్న టి.ఎ.కళ్యాణంతో స్నేహం ఏర్పడింది. దాంతో ఆయన దగ్గరే సినిమా సంగీతం గురించి పూర్తిగా తెలుసుకున్నారు. 1942లో ‘మనోన్మణి’ మూవీ కోసం ఒక పాట ట్యూన్ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే ఆయనకి క్రెడిట్ దక్కలేదు.‘ఆనందన్‌’ అనే సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆ తర్వాత ‘దేవదాసి’ అనే సినిమాకి సంగీతం సమకూర్చినా అంతగా పేరు రాలేదు. దాంతో అవకాశాలు రావడం కూడా కష్టమైంది.

అంతలో ఎంతో ప్రతిభ గల పుహళేందితో కేవీకి పరిచమయ్యింది. ఆయన్ని తన అసిస్టెంట్‌గా పెట్టుకున్నారు మహదేవన్. ఒకరు దేహమైతే, మరొకరు ఆత్మ అన్నట్టు పని చేసేవారు. ఉండేకొద్దీ అవకాశాలు పెరిగాయి. కందన్ కరుణై, వసంత మాలిగై, వియత్నాం వీడు లాంటి సూపర్‌‌ హిట్స్‌ వారి నుంచి వచ్చాయి. ‘కందన్ కరుణై’ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు మహదేవన్.  జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఆయనే కావడం విశేషం. తన కెరీర్‌‌లో ఏ రోజూ మొదట ట్యూన్‌ కట్టలేదు మహదేవన్. లిరిక్స్ రాశాకే ట్యూన్ చేసేవారు. ఏ భాషలో అయినా అదే ధోరణి. నిజానికి మహదేవన్‌కి తెలుగు రాదు. ఆయన అసిస్టెంట్ పుహళేంది లిరిక్స్ని చదివి వినిపించేవారట. వెంటనే వాటికి తగ్గ స్వరాలను సమకూర్చేసేవారట మహదేవన్.  కెరీర్‌‌ మొత్తంలో ముందు ట్యూన్‌ చేసి తర్వాత లిరిక్స్ రాసిన పాటలు పదికంటే ఎక్కువ ఉండవు. అది కూడా ఆయా దర్శక నిర్మాతలకు కోరడం వల్లే చేశారు తప్ప తనకి ఇష్టమై కాదు. లిరిక్స్ని మ్యూజిక్ డామినేట్ చేయడకూడదని, ముందుగా భావం తెలిస్తే దానికి తగ్గ సంగీతాన్ని సమకూర్చగలనని ఆయన అనేవారు. 

మధుర స్వరాల మామ

కేవీ మహదేవన్‌ని  తెలుగు వారంతా మామా అని పిలిచేవారు. దానికి కారణం ‘మంచి మనసులు’ సినిమా. అందులో ‘మావ మావా మావా’ అనే పాట ఓ రేంజ్‌లో ఊపేసింది. దాంతో ఆ పాట ట్యూన్ చేసిన మహదేవన్‌ని అందరూ మామా అని పిలవడం మొదలుపెట్టారట. నిజానికి తమిళ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చినా, మహదేవన్‌కి ఎక్కువ పేరు తెలుగులోనే వచ్చిందనడంలో సందేహం లేదు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక సినిమాలెన్నింటికో అద్భుతమైన పాటలు చేశారాయన. తెలుగులో ఆయన చేసిన మొదటి సినిమా ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఈ సినిమాలోని పాటలన్నీ ఆకట్టుకోవడంతో వరుస అవకాశాలు వచ్చాయి. బొమ్మలపెళ్లి, ముందడుగు, ముత్యాలముగ్గు, దాగుడు మూతలు, మూగ మనసులు, అంతస్తులు, మనుషులు మారాలి, బడి పంతులు, సిరి సిరి మువ్వ, సప్తపది, సిరివెన్నెల, శ్రుతిలయలు, శ్రీనివాస కళ్యాణం, జానకి రాముడు, ముద్దుల మావయ్య, అల్లుడుగారు, పెళ్లి పుస్తకం, స్వాతి కిరణం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతమైన మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి.

అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘శంకరాభరణం’ గురించి.  జేవీ సోమయాజులు ప్రధాన పాత్రలో కె.విశ్వనాథ్‌ తీసిన ఈ సినిమా ఓ సంగీత విద్వాంసుడి జర్నీ. అంటే చిత్రానికి సంగీతమే ప్రాణం. అందుకే కేవీ మహదేవన్‌ని ఏరి కోరి ఎంచుకున్నారు విశ్వనాథ్. ఇక తన బాధ్యతను ఆయన ఎంత గొప్పగా నిర్వర్తించారో తెలియంది కాదు. ప్రతి పాటనీ ఓ ఆణిముత్యంగా మలిచారు మహదేవన్.  అందుకే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఎస్పీబీకి, వాణీ జయరామ్‌కి కూడా నేషనల్‌ అవార్డును తెచ్చిపెట్టాయి ఆయన కంపోజ్ చేసిన పాటలు. ఇలా మహదేవన్‌ ద్వారా ఎన్నో మధుర స్వరాలను వినే అదృష్టం తెలుగువారికి దక్కింది. ఆయనకు తెలుగు సినీ చరిత్రలో ఒక పేజీ దక్కింది.

ప్రయోగాల పుట్ట.. సంగీత స్రష్ట

సినీ సంగీతంలో చాలా కొత్త ఒరవడులు తీసుకొచ్చారు మహదేవన్. శాస్త్రీయ సంగీతాన్ని సినీ సంగీతంలో మిక్స్ చేసిన మొదటి సంగీత దర్శకుడు ఆయనేనని చెబుతారు. సినిమాల్లో గ్రామీణ పాటలకు ఊపిరి పోసింది కూడా ఆయనేనంటారు. ‘వీరాభిమన్యు’ సినిమాలోని ఒక పాటకు విషాద గీతాలకు వాడే సన్నాయిని వాడటం.. ‘ఏకలవ్య’ సినిమాలోని ఓ పాటకి కేరళ సంప్రదాయపు పరికరాల్ని ఉపయోగించడం ఆయన ప్రతిభకు తార్కాణాలుగా పరిగణిస్తారు. ‘ముత్యాల ముగ్గు’లో సజ్జద్ హుస్సేన్ చేత మాండలిన్ వాయింపజేశారు. ‘సిరివెన్నెల’లో పండిట్ హరిప్రసాద్ చౌరాసియా చేత ఫ్లూట్‌ని ప్లే చేయించారు. ఇలా ఏదో ఒక కొత్తదనం తీసుకు రావడానికి చాలా ప్రయత్నించేవారు. ఎప్పటికప్పుడు ఆడియెన్స్ కి  కొత్త అనుభూతిని అందించేవారు.

చివరి కానుక

తెలుగులో కేవీ మహదేవన్ వర్క్ చేసిన చివరి చిత్రం ‘స్వాతి కిరణం’. తెలుగు సినీ సంగీత ప్రియులకి కేవీ మహదేవన్‌ ఇచ్చిన చివరి కానుక ఈ సినిమా. ఈ సినిమాకి ఆయన కంపోజ్ చేసింది రెండు పాటలే. అప్పటికే ఆరోగ్యం సహకరించని పరిస్థితి రావడంతో మిగతా పాటలన్నింటినీ పుహళేంది స్వరపరిచారు. అయినా కూడా మహదేవన్ పేరునే వేసి గురువుపై తన అభిమానాన్ని చాటుకున్నారు. తమిళంలో విడుదలైన మహదేవన్‌ చివరి సినిమా ‘మురుగనే తుణై’. ‘కబీర్‌‌దాస్‌’ సినిమా మాత్రం ఆయన చనిపోయిన తర్వాత రిలీజైంది. సంగీత చక్రవర్తిగా జీవితమంతా అవార్డులు, రివార్డులు అందుకున్న మహదేవన్.. జీవిత చరమాంకంలో మాత్రం చాలా అవస్థ పడ్డారు. నరాల బలహీనత వచ్చింది.. మాట పడిపోయింది..మతిస్థిమితం కూడా తప్పింది. దాంతో ఓ గదిలో ఆయన్ని ఒంటరిగా వదిలేసేవారు. చివరికి శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమవడంతో హాస్పిటల్‌లో చేర్పించారు. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ 2001, జూన్ 21న  కన్నుమూశారు మహదేవన్. గొప్ప సంగీతకారుణ్ని కోల్పోయింది సినిమా లోకం.