
మెదక్/చేగుంట, వెలుగు: రూ.24 వేల కోట్లతో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. మంగళవారం రాత్రి మెదక్ జిల్లా చేగుంట లో ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా సండ్రగు బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫలహారం బండి ఊరేగింపుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో దివంగత మాజీ మంత్రి ముత్యంరెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలసి పాల్గొన్నట్టు తెలిపారు. ఎలక్షన్ లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రజల కోసం ప్రజా సేవ చేస్తున్నామన్నారు. 12 ఏళ్ల కింద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు తప్ప వేరే ఇల్లు రాలేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. దుబ్బాక నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారు వెంటనే నిర్మాణం ప్రారంభించాలని సూచించారు.
త్వరలోనే మరో 3,500 ఇల్లు రాబోతున్నాయన్నారు. పేదలకు వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా రూ.9 వేల కోట్లతో సన్నబియ్యం పంపిణీ చేపట్టామని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల రూ.36 వేల కోట్లతో ప్రారంభిస్తే బీఆర్ఎస్ రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం అని మొదలుపెట్టిందన్నారు. కాళేశ్వరం కూలిపోయిందనీ, దాని ద్వారా 1,200 టీఎంసీ నీళ్లు రావాలి కానీ 60 టీఎంసీ మాత్రమే వచ్చాయన్నారు. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు కాకుండా కేవలం ఎల్లంపల్లి నీళ్లు మాత్రమే వస్తున్నాయన్నారు. ఈ ప్రాంతానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరుకు కృషి చేస్తామన్నారు. డిగ్రీ కాలేజీ కావాలని చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆవుల రాజిరెడ్డి, సుప్రభాత రావు పాల్గొన్నారు.