పైసలిస్తలేరని నర్సరీల్లో  పని మానేస్తున్న కూలీలు

పైసలిస్తలేరని నర్సరీల్లో  పని మానేస్తున్న కూలీలు
  • రూ.లక్షల్లో పేరుకుపోతున్న బకాయిలు
  • పట్టించుకోని అధికారులు 

మెదక్​(కౌడిపల్లి, శివ్వంపేట), వెలుగు: మెదక్​ జిల్లాలో పచ్చదనాన్ని పెంచడంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణ అధ్వానంగా మారింది. హరితహారంలో నాటేందుకు నిర్వహిస్తున్న నర్సరీల్లో పని చేసిన కూలీలకు డబ్బులు సరిగా ఇవ్వడం లేదు. నెలల తరబడి డబ్బులు ఇవ్వకపోవడంతో లక్షల్లో బకాయిలు పేరుకుపోతున్నాయి. దీంతో కూలీలు పనిలోకి రాక మొక్కలు ఎండిపోతున్నాయి. 

ఇదీ.. పరిస్థితి

శివ్వంపేట మండలం మగ్దుంపూర్ లో రెండు నర్సరీలు ఏర్పాటు చేశారు. ఒక నర్సరీలు లక్ష, మరో నర్సరీలో 50 వేల మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించి పనులు చేపట్టారు. కానీ పని చేసిన కూలీలకు డబ్బులు ఇవ్వకపోడంతో వారు పని మానేశారు. ఈ క్రమంలో పాడవుతున్న కొన్ని మొక్కలను బావిలో పడేశారు. మరికొన్ని మొక్కలు నీళ్లు లేక ప్యాకెట్లలోనే ఎండిపోయాయి.  పిలుట్ల నర్సరీలో లక్ష మొక్కలు, శివ్వంపేటలో లక్ష మొక్కలు, తిమ్మాపూర్​లో లక్ష మొక్కలు ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. కానీ ఆశించినంతగా పని కావడం లేదు.  మగ్దుంపూర్ లో 12 మంది కూలీలకు ఒక్కొక్కరికీ 20 రోజుల డబ్బులు రావాల్సి ఉంది. పిల్లుట్లలో 15 మంది కూలీలకు ఒక్కొక్కరికి 30 రోజుల డబ్బులు రావాల్సి ఉంది. ల్యాండ్​ రెంట్స్ కూడా బకాయిలు ఉన్నాయి. కౌడిపల్లి మండల వ్యాప్తంగా 29 నర్సరీలు ఉన్నాయి. దాదాపు 500 మంది కూలీలకు నాలుగు నెలలుగా డబ్బులు చెల్లించకపోవడంతో రూ.4.5‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. పైసలు ఇవ్వకపోవడంతో కూలీలు నర్సరీలలో మొక్కలకు నీళ్లు పోయడం లేదు. దీంతో ఎక్కడికక్కడ మొక్కలు ఎండిపోయాయి. మండలంలోని వెంకటాపూర్ (ఆర్), కూకుట్లపల్లి, భుజరంపేట, బూరుగడ్డ, శేరితండా, పీర్లతాండ నర్సరీలలో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నర్సరీల నిర్వహణకు తగిన చర్యలు  తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నాలుగు నెలల కూలి ఇయ్యలె.. 

నర్సరీ లో పనిచేసిన మాకు నాలుగు నెలల కూలి పైసలు ఇయ్యలేదు. అందుకు పనికి వెళ్లట్లేదు. బోరు కూడా పాడుకావడం, కూలీలు రాకపోవడంతో నీరు అందక మొక్కలు ఎండుతున్నాయి. - అజ్మీర మోహన్, షేరి తండా 

కూలీలు రాక ఇబ్బంది.. 

మగ్దుంపూర్ లో నర్సరీల్లో పని చేసిన ఉపాధి హామీ కూలీలకు డబ్బులు రాలేదు. నర్సరీకి మట్టి కొట్టిన దానికి సంబంధించి, నర్సరీ ఏర్పాటు చేసిన భూమి యజమానికి అద్దె డబ్బులు కూడా రాలేవు. దీంతో కూలీలు పనిలోకి వస్తలేరు. నర్సరీ నిర్వహణ 
ఇబ్బంది అవుతోంది. - సత్యనారాయణ, ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​, శివ్వంపేట

ప్రతివారం ఆన్​లైన్​ చేస్తున్నాం

నర్సరీలలో పనిచేస్తున్న కూలీల వివరాలు ప్రతివారం ఆన్​లైన్​ లో అప్​ లోడ్​ చేస్తున్నాం.  కూలీల అకౌంట్​లో డబ్బులు జమ కాకపోవడం పైనుంచి బడ్జెట్ ప్రాబ్లం ఉండొచ్చు. మొక్కల విషయంలో నిర్లక్ష్యం చేయడం లేదు. కొత్త నర్సరీలు ఏర్పాటు కావడంతో పాతవాటిలో మొక్కలు తక్కువగా కనిపిస్తున్నాయి. - భారతి, ఎంపీడీవో కౌడిపల్లి